ఎవరి స్థానాలలో వారు ఉండాలి. ఎవరి పని వారు చేయాలి. రాజకీయాల్లో రాసుకుపూసుకు తిరగకూడదు. రంగు పడింది అంటే ఎంత వదిలించుకున్న వదలదు. విశాఖలోని ఒక స్వాముల వారికి అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది.
విశాఖలో శ్రీ శారదాపీఠం అధిపతిగా ఉన్న స్వరూపానందేంద్ర మహా స్వామి వారు తాను రాజకీయాలకు అతీతమని తాజాగా ప్రకటించారు. తనకు అందరూ సమానమే అని అన్నారు. చంద్రబాబుని సైతం పొగిడారు.
అయినా ఏపీలో వేడెక్కిన రాజకీయ పరిస్థితుల మధ్య స్వాములోరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనకు వైసీపీ ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ భద్రతకు ఇపుడు మంగళం పలకబోతున్నారు. స్వామి పీఠం ముందు నలుగురు గన్ మెన్ లు ఆరుగురు సిబ్బందితో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ని తీసేస్తున్నారు.
సర్వం త్యజించిన స్వాములకు భద్రత ఎందుకు అని కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే స్వామికి ప్రోటోకాల్ రూపేణా ఇచ్చిన బుగ్గ కారు వినియోగం సదుపాయాన్ని కూడా కట్ చేస్తున్నారు. వీటి ఖర్చు నెలకు 18 నుంచి 24 లక్షల దాకా ఉందని ఎందుకు ఈ దండుగ మారి వ్యవహారం అని అంటున్నారు.
తొందరలోనే పీఠం లో అక్రమాలు అన్యాయాలు జరిగాయన్న అరోపణల మీద విచారణ చేయబోతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ముక్కు మూసుకుని ఆధ్యాత్మిక సేవలో ఉండాల్సిన వారు అతి చేస్తే ఇలాగే ఉంటుందని అంటున్నారు ఆస్థిక జనులు.