వైసీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండ మీద రాజ ప్రసాదాలు నిర్మించారు. అద్భుతమైన డిజైన్లతో వీటికి రూపకల్పన చేశారు. తమాషా ఏంటి అంటే మరోసారి సీఎంగా అధికారం దక్కితే విశాఖ నుంచి పాలన చేయాలనుకున్నారు జగన్. అలా రుషికొండ భవనాలనే క్యాంప్ ఆఫీసుగా చేసుకుని పాలించాలని భావించారు.
కానీ అది నెరవేరలేదు. ఆ భాగ్యం మాత్రం భీమిలీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు దక్కింది. ఆయన పరిధిలోకి వచ్చే రుషికొండ ప్రాంతంలోని ఈ అద్భుత కట్టడాలని ఆయన మీడియాతో సహా వెళ్లి మొత్తం అంతా తరచి చూసారు. భవనాలు అన్నీ కాస్ట్లీ గా నిర్మించారు అని అంటున్నారు.
అత్యాధునిక సాంకేతిక సంపత్తితో ఈ భవనాల నిర్మాణం రూపుదిద్దుకుందని మీడియాకు విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. ఈ రాజ ప్రసాదాన్ని చూసిన తరువాత గంటా మీడియాతో మాట్లాడుతూ జగన్ కలల ప్రాసాదంలోకి తానే అడుగు పెట్టలేకపోయారు అని అన్నారు.
వీటిని ఎలా ఉపయోగంలోకి తీసుకుని రావాలన్నది ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని అన్నారు. గతంలో ఎవరినీ వీటిని చూసేందుకు కూడా అనుమతి లేకుండా రహస్యంగా నిర్మించారు అని తప్పు పట్టారు. జగన్ విశాఖలో ఏమి కట్టారు అంటే కళ్ళకు కనిపించే కట్టడాలుగా ఇవి ఉన్నాయి.
మరి టీడీపీ ప్రభుత్వం వీటిని ఎలా వినియోగిస్తుంది అన్నది చూడాలి. టీడీపీ వారు అయితే విమర్శిస్తున్నారు. ఫోటోలు చూసిన తరువాత సగటు జనాలు ఈ రాజ ప్రాసాదాన్ని చూడాలని భావిస్తున్నారు. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజలకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని అంటున్నారు.