హైదరాబాద్‌లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ఎదుట అక్రమ నిర్మాణాల్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. లోటస్‌పాండ్‌లో జగన్‌కు భద్రత నిమిత్తం సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రోడ్డుపై అక్రమంగా వీటిని నిర్మించారని, అడ్డంకిగా తయారయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లోటస్‌పాండ్ ఏరియా సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న మూడు షెడ్లను తొలగించారు. ఏపీలో జగన్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో తొలగింపుపై చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో జగన్‌కు రాజకీయ విబేధాలున్న సంగతి తెలిసిందే.
అలాగే రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కోణంలో జగన్ ఇంటి ఎదుట ఆయన భద్రతా సిబ్బంది కోసం నిర్మించిన షెడ్ల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే వీటి తొలగింపుపై జగన్ సంబంధీకులెవరూ అడ్డు చెప్పలేదని సమాచారం. దీన్ని పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.