చాలా కాలం తర్వాత జగన్ ప్రెస్‌మీట్ పెట్టాడు. విలేకరులంతా ఆశ్చర్యంతో వచ్చారు.
“ఈ ప్రెస్‌మీట్ ఇపుడెందుకంటే….” స్టార్ట్ చేసాడు జగన్.
“ఓడిపోయారు కాబట్టి. గెలిస్తే ఇంకో ఐదేళ్లు ప్రెస్‌మీట్ వుండేది కాదు. ప్రెస్‌మీట్ అంటే మీకెందుకు భయమంటే, ప్రశ్నలంటే భయంకాబట్టి” అన్నారు విలేకరులు.
“జగన్‌కి భయం తెలియదు”
“భయమే కాదు, పరిపాలన కూడా తెలియదని జనం నమ్మారు”
“నేను వాళ్లకి ఏం తక్కువ చేసాను. అప్పులు చేసి బటన్ నొక్కాను”
“అందుకే మిమ్మల్ని సర్ ఆర్ధర్ కాటన్‌లా, సర్ ఆర్ధర్ బటన్ అని పిలుస్తున్నారు”
“నన్ను ఓడించింది జనం కాదు, దేవుడు”
“దేవుడు నేరుగా స్క్రిప్ట్ రాయడు, జనంతో రాయిస్తాడు”
“నేను ప్రజలకి మేలు చేసినా, దేవుడు నాకు మేలు చేయలేదు”
“దేవుడు మేలు చేసినా , మీరు నిలుపుకోలేదు. జనానికి డబ్బు పంచితే , ఓట్లు పంచుతారని అనుకున్నారు. వాళ్లు ఓటమిని పంచారు”
“నన్ను జనం ఓడించలేదు. ఈవీఎంలు ఓడించాయి. పచ్చ మీడియా అబద్ధాలు ఓడించాయి”
“ఎలా ఓడినా, ఓడిపోయారా? లేదా?”
“ఐదేళ్లు ఎంతసేపు, కన్ను మూసి తెరిస్తే అయిపోతాయి. మళ్లీ నేనే గెలుస్తాను”.. “ఎలా?”
“చంద్రబాబు పాపాలు చేస్తాడు”
“చేయకపోతే”
“చేస్తాడు, అతని నైజం”
“అంటే బాబు పాపాలు, తప్పుల మీద మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు. అంతేకానీ మీ సమర్థత మీద కాదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు”
“నేను ఏ సిద్ధాంతాన్నీ నమ్మను. అవ్వాతాతల ఆప్యాయత, అక్కాచెల్లెమ్మల అభిమానాన్ని నమ్ముతాను”
“ఈ డైలాగ్‌లు సినిమాలకి బావుంటాయి. రాజకీయాలకి కాదు. అభిమానాలు, ఆప్యాయతలు రాజకీయాల్లో గాలిబుడగలు, ఆశాశ్వతాలు. అదే నిజమైతే మీ చెల్లి షర్మిలకి మీకూ వున్న అభిమానం, ఆప్యాయత ఏమైంది? ముందు మీరు భ్రాంతి నుంచి వాస్తవంలోకి రావాలి. నిద్ర నుంచి మెలకువ అవసరం”
“మీరిలా మాట్లాడతారనే నేను ప్రెస్‌మీట్‌లు పెట్టను”
“విలేకరులకే కాదు, మీరు జనానికి కూడా దూరం జరిగారు. మీరు దూరమైతే , జనమే కాదు, ఎవరైనా దూరమవుతారు. దూరం చేసుకోవడం క్షణాల్లో పని, దగ్గరికి చేర్చుకోవడం జీవితకాలపు సాధన”
“నేనెక్కడ దూరం జరిగాను. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసాను”
“మేలు చేయడమంటే బటన్ నొక్కి డబ్బులు వేయడం కాదు. వాళ్లతో కలిసిమెలిసి కష్టసుఖాలు తెలుసుకోవడం”
“తెలుసుకోడానికే కదా, ఎమ్మెల్యేలను గడపగడపకి తిప్నాను”
“చేతిలో రూపాయి లేకుండా, ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరిస్తారా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు. మీ దృష్టిలో జనమంటే పథకాల లబ్ధిదారులు, తాడేపల్లిలో మీ భజన చేసేవాళ్లు”
“గెలిస్తే అందరూ సైలెంట్ అయిపోతారు. ఓడితే ప్రతివాడు విశ్లేషిస్తాడు”
“ఈ ఐదేళ్లు మీ పాలన సజావుగా సాగిందని నమ్ముతున్నారా?”
“అక్షరాలా? నేను మా నాన్న వైఎస్‌కి మించి పథకాలు ఇచ్చాను”
“మీ నాన్నకి పథకాలూ తెలుసు, పాలనా తెలుసు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన నాయకుల్ని తయారు చేసాడు. మీరు తయారు చేసిన నలుగురి పేర్లు చెప్పండి చూద్దాం”
“నేను కూడా ఎందర్నో ఎమ్మెల్యేలు, మంత్రులూ చేసాను”
“మంత్రుల్ని చేసారు, కానీ వాళ్లెపుడు మంత్రులుగా లేరు. అందుకే ఒకరు మినహా అందరూ ఓడిపోయారు. మీ పాలన మీద వచ్చే విమర్శల్ని తిప్పికొట్టే వాళ్లు లేకుండా పోయారు. తిట్ల మంత్రులు మాత్రమే మిగిలారు. మీకూ మీ నాన్నకి వున్న తేడా ఏమంటే , నీళ్లలో వున్న వాళ్లని ఆయన ఒడ్డుకి లాగుతాడు, మీరు నీళ్లలో వుండి, అందర్నీ లోపలికి లాగుతారు”
“ఇది అన్యాయయమైన ఆరోపణ. సరే ఇపుడేం చేయాలి”
“యుద్ధం”.. “చంద్రబాబు మీద”
“కాదు మీ మీద, మీ లోపాలు, వైఫల్యాల మీద, శిక్షణ లేని సైన్యం, అదుపులేని నోరు, జ్ఞానం లేని పాలన ఎంత చేటు చేస్తాయో తెలుసుకోండి. చంద్రబాబు తప్పులు చేస్తే జనమే సమాధానం చెబుతారు”
“అపుడు నేను పాదయాత్ర చేస్తా”
“ఒకసారి జరిగితే అద్భుతం. రెండోసారి జరిగితే హాస్యాస్పదం. ఒక ఛాన్స్ అడిగారు, ఇచ్చారు. తండ్రిని మరిపిస్తామన్నారు. నమ్మారు. ఏం జరిగింది? మీరు యాత్ర చేయక్కర్లేదు. చంద్రబాబు సరిగా పాలించకపోతే, జనమే యాత్ర చేస్తూ మీ దగ్గరికొస్తారు”
“ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు”
“శకునం చెప్పే బల్లిని కుడితిలో పడేయడం, కుమ్మడం మీ పార్టీ ప్రాథమిక లక్షణమైతే ఎవరు నిజాలు మాట్లాడుతారు? అందమైన అబద్ధాలే చెబుతారు. దాని ఫలితం రెండు నామాలు. అంటే 11”