పియానో మెట్ల మీద వేళ్లు జారి పడితే సంగీతం. తీగ తన బాధని చెప్పుకుంటే వాయులీనం. మొటిక్కాయలు తింటే తబలా. గాలి వూదుతూ మసాజ్ చేస్తే ట్రంపెట్. వేళ్లు చేసే మంత్రజాలమే వాయిద్యం. స్వరంలోంచి జారే ఆనందమే పాట.
కోయిలగానం అమ్ముడుపోదు. అందుకే ఎవరూ పెంచుకోరు. చిలుక అతి తెలివితో మాట్లాడి పంజరంలో చిక్కుకుంది. నెమలి నువ్వు ఆడమంటే ఆడదు. వానవిల్లు కనబడితే రెక్కలన్నీ రంగులవుతాయి. అంగట్లో అన్నీ సరుకులు కాదు.
ఏడుస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చావు. ఆనందం ఫేస్ ప్యాక్ మాత్రమే. ఏడుపొస్తే చిన్నపిల్లాడిలా ఏడు, ఈ లోకం కన్నీళ్లని చూసి జాలిపడదు. నీ లోపల ఒక శిలని నిర్మించే పనిలో బిజీగా వుంటుంది. శిల, శిల్పమో! నీ చేతిలోనే ఉలి వుంది.
మాటలకి అర్థాలు వెతకొద్దు. అన్నీ నువ్వు నిర్మించుకున్నవే. అర్థమయ్యేలా మాట్లాడితే విషం తాగిస్తారు. ఎన్ని పాత్రలు తాగినా సోక్రటీస్ బతికే వుంటాడు. శిలువ ఎక్కిన తరువాతే క్రీస్తుని దేవుడన్నారు.
బ్రహ్మం లేడు, మాయ లేదు. అంతా శూన్యమే. శ్మశానవాటికే శాశ్వతం. మట్టిలో కలిసిపో, కాలిపో. మూడో మార్గం లేదు. సత్యాన్ని అన్వేషించిన వాళ్లు, అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్లు అంతా అక్కడే వున్నారు. వర్గాలు, తరగతులు లేవు. అంతా సమానమే. మార్క్స్ అక్కడ మాత్రమే గెలుస్తాడు.
మంచి గురువుని ఎంచుకో. వాడైనా మోసం చేస్తాడు, నువ్వయినా మోసం చేస్తావు. మోసం అనే వంతెన మీద ప్రపంచం నడుస్తూ అపుడపుడు జారి సన్మార్గంలో పడుతూ వుంటుంది. ధర్మం, ప్రవచనం అంతా సుగర్ కోటెడ్. కాకరకాయ తింటే ఆరోగ్యం. కథలు వింటే అనారోగ్యం.
నోరు ఒకటే. నాలుకలు వెయ్యి. నువ్వు మాట్లాడుతున్న నాలుక నీదా, ఇంకెవరిదైనా? శిథిలమైన ప్రపంచం మీదకి రాళ్లు విసరకు. చేతులు నొప్పి, తలబొప్పి.
పరుసవేది కోసం మనుషులు శతాబ్దాలుగా వెతుకుతున్నారు. అది ఎక్కడో లేదు. మనలోనే వుంది. లోపల వుంటే గుర్తించం. కన్నీళ్లు గుర్తు పడితే , చిరునవ్వు మొలకెత్తించగలిగితే పరుసవేది బయటికొస్తుంది.
ఇనుము బంగారంగా మారడం రసవిద్య కాదు. మనుషులే బంగారంగా మారడం యోగవిద్య.
విష సర్పాలుంటాయి. బుసలు కొడుతూ వుంటాయి. నాగలోకం దాటితేనే నాగమణి.
భూమ్మీద నరకం సృష్టించే వాళ్లే స్వర్గం కోరుకుంటారు. అది నువ్వు నమ్మిన వాళ్ల అరచేతిలో వుంది. భూమి కోసం ఎందుకు పోరాడుతావు? భూమే నీ కోసం పోరాడుతూ వుంది. అది పిలుస్తూ వుంటుంది. నేనున్నానని గుర్తు చేస్తూ వుంటుంది. నీ కిటికీలోంచి మట్టి రేణువుల్ని అతిధులుగా పంపిస్తుంది.
ఆహ్వానం వున్నప్పుడు వీడ్కోలు కూడా వుంటుంది. ఆస్పత్రుల్లో ఆగమనం నిష్క్రమణ నిత్యకృత్యం. ప్రపంచం ఒక పాడుబడిన బస్టాండు. వాహనాలు ఆగవు. కానీ ఎందరో ఎదురు చూస్తూ వుంటారు.
జీఆర్ మహర్షి