కూటమి అధికారం చేపట్టిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. పల్లె నుంచి పట్టణాల వరకూ ఆదాయ వనరులు, నామినేటెడ్ పోస్టులపై ఆ పార్టీ నాయకులు దృష్టి సారించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతం చేసుకున్న వాటిని స్వాధీనం చేసుకోడానికి టీడీపీ నేతలు వేగం పెంచారు.
ప్రధానంగా ప్రభుత్వ చౌక దుకాణాలు, మద్యం అమ్మకాలు, ఆలయాల పాలక మండళ్లు, ఇసుక విక్రయాలపై టీడీపీ నేతలు అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి జనసేన జత కలిసింది. రెండూ మిత్రపక్ష పార్టీలన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన అడగక ముందే, తమ పదవులకు వైసీపీ నేతలు రాజీనామాలు చేశారు.
ఇక ఆదాయ వనరులున్న చోట టీడీపీలో పోటీ పెరిగింది. తమకంటే తమకు కావాలని పంతాలు, పట్టింపులకు వెళుతున్నారు. పోటీ ఎక్కువైన చోట టీడీపీలోనూ, అలాగే జనసేన నేతల మధ్య వర్గాలు, విభేదాలు మొదలయ్యాయి. జనసేన నేతల్ని కొన్ని చోట్ల దూరం పెడుతున్నారు. ఇది ఆ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురి చేస్తోంది.
ఇసుక, మద్యం విక్రయాలకు సంబంధించి టీడీపీలో తీవ్రమైన పోటీ నెలకుంది. అలాగే చౌక దుకాణాల విషయమై కూడా పోటీ ఏర్పడింది. ఇంకా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కుదట పడకనే, కిందిస్థాయిలో టీడీపీ నేతలు అధికారం చెలాయిస్తుండడం చర్చనీయాంశమైంది. అధికారులతో సంబంధం లేకుండానే, అధికార పార్టీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో గొడవలు ఎందుకులే అనే ఆలోచనలో చాలా వరకూ వైసీపీ నేతలే పక్కకు తప్పుకుంటున్నారు.