నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరించడం అనే సామెత ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరు చూస్తే అచ్చం అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తనను కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించి, అభినందించడానికి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికార్లతో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే మనకు ఆ అనుమానమే కలుగుతుంది. అధికార్ల మీద తన అక్కసును వెళ్లగక్కడానికి ఆయన ఏమాత్రం ఆగలేకపోయారు. వారి మీద నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నా సరే.. అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం ఆనవాయితీ. జస్ట్ వాళ్లను కలిసి వారిచ్చే బొకే అందుకుంటే సరిపోతుంది. ఇలాంటి హడావుడి బాధ్యతలు స్వీకరించిన తొలిరెండు మూడురోజులు బాగానే ఉంటుంది. అధికారులు నిజంగా తప్పులు చేసి ఉంటే, వారి మీద చర్యలు అనివార్యమైతే ఆ పర్వం ఆ తర్వాత చూసుకోవచ్చు. మర్యాదపూర్వకంగా పలకరించడానికి వచ్చిన వారిని మర్యాదగా ట్రీట్ చేసి పంపేస్తే సరిపోతుంది.
కానీ ఇప్పుడు సీఎంగా పదవి స్వీకరించినది.. మారిపోయిన చంద్రబాబు కదా.. కాబట్టి ఆయన వెరైటీగానే వ్యవహరించారు. బొకేలతో వచ్చిన అధికారుల్ని తన వద్దకు రానివ్వకుండా సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. అలా అధికారులందరూ అక్కడ కూర్చుని వేచిఉండగా.. తాను అక్కడకు వచ్చి ఒక్కసారిగా వారి మీద విరుచుకుపడ్డారు.
గత ప్రభుత్వం మీద ప్రజల్లో అంత కసి వచ్చిందంటే.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవపదవుల్లో ఉన్న అధికారులే కారణమని, వారి పాత్ర చాలా ఉందని అన్నారు. నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడను.. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి తర్వాత వివరంగా మాట్లాడుతాను అంటూ హెచ్చరించారు. వ్యవస్థలను గాడిలో పెడతానని అన్నారు. అంటే ఇండైరక్టుగా అధికారులు అందరి మీద కత్తి దూయడానికి సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా హెచ్చరించడమే అని పలువురు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందునుంచి అధికారులు మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. అధికారులు తనను కలవడాన్ని కూడా ఇష్టపడలేదంటే.. ఆయన వారి మీద ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారో అర్థమవుతోంది. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ప్రతి అధికారికీ స్థానచలనం తప్పదని, వారందరినీ పనిష్మెంట్ జోన్లలోకి పంపుతారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.