ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రత్యర్థుల అభిమానాన్ని కూడా చూరగొన్న ఏకైక నాయకుడు పవన్‌కల్యాణ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారం వచ్చిందన్న గర్వం ఆయన మాటల్లో మచ్చుకైనా కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్‌ను ఆయన లైట్ తీసుకున్నారు. అవన్నీ ఎన్నికల ముందు సర్వసాధారణమే అని, తాను వైసీపీ నేతల్ని విమర్శించానని, వారు తనను తిట్టారని, ఇందులో తప్పేమీ లేదని ఆయన ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అందరికీ నచ్చేలా చేసింది.
అలాగే కక్ష సాధింపు చర్యలకు ఇది సమయం కాదని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అలాగే వైసీపీ నేతలపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన అనడం ప్రత్యర్థులకు నచ్చిన అంశం. ప్రస్తుతానికి ఆయన తీరు ఏ నాయకుడైనా పవన్‌లా వుంటే బాగుంటుదన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వానికి తాను వ్యతిరేకమని చెప్పడమే కాదు, ఆచరించి చూపుతున్నారని, రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని పలువురు అంటున్నారు.
కూటమిలో భాగస్వామి అయిన పవన్‌కల్యాణ్ ఎంత కాలం ఇలా వుంటారనేది చర్చనీయాంశమైంది. పవన్ తనకిష్టం వచ్చినట్టు వుండే పరిస్థితిని ప్రధాన మిత్రపక్ష పార్టీ కల్పిస్తుందా? అనేదే ప్రశ్న. అయితే పవన్‌కల్యాణ్ స్వతంత్రంగా ఉండాలనే బలమైన ఆకాంక్ష కలిగిన నేతగా జనసేన నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత , దాన్ని అడ్డం పెట్టుకుని ఇతరుల్ని ఏదో చేయాలని మాత్రం పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోరని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు.
ఎవరేంటనేది భవిష్యత్ కాలం సమాధానం చెప్పనుంది. అధికారం అనేది మత్తులాంటిది. అది ఉన్నంత వరకూ ఏమీ కనిపించదు, వినిపించదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా సామాన్యుల్లా మెలగడమే గొప్పతనం. అలా వుండడం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. పవన్‌కల్యాణ్‌ను అధికారం ఎంత వరకు ప్రభావం చూపుతుందో మరి! ప్రస్తుతానికి అయితే ఆయన తీరు ఓకే అని ప్రత్యర్థులు సైతం అంటున్నారు.