ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది, టీడీపీలో అయ్యన్నపాత్రుడు అత్యంత సీనియర్ నాయకుడు. చంద్రబాబు సమకాలికుడు. అలాంటి అయ్యన్నపాత్రుడికి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో వంగలపూడి అనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది.
ఈ నేపథ్యంలో అయ్యన్నకు మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ వర్గాలు కారణం చెబుతున్నాయి. అయ్యన్న కుమారుడు చింతకాయల అయ్యన్నపాత్రుడికి రాజ్యసభ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అందుకే కేబినెట్‌లో అయ్యన్నపాత్రుడికి చోటు కల్పించలేదని తాజా సమాచారం.
అనకాపల్లి ఎంపీ సీటును చింతకాయల విజయ్ ఆశించారు. రాజకీయ వారసుడైన తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు ఒత్తిడి తెచ్చారు. అయితే జనసేన, బీజేపీతో పొత్తు కారణంగా, ఒకే ఇంట్లో ఎక్కువ సీట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై విస్తృత చర్చకు దారి తీసింది.
సీనియర్ నాయకుడైన అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఆయన కుమారుడికి రానున్న రోజుల్లో రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ. దీంతో అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చినట్టైంది.