మంత్రి పదవులు దక్కలేదని టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. అయితే ధైర్యం చేసి, తమ ఆగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించలేని దయనీయ స్థితిలో సీనియర్ నేతలున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సుదీర్ఘకాలంగా టీడీపీలో వుంటూ, పార్టీ కష్టనష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచినందుకు తమకు దక్కింది ఏంటనే ప్రశ్న సీనియర్ నేతల నుంచి ఎదురవుతోంది.
17 మంది కొత్తవారికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్టు కేబినెట్ కూర్పు జరిగినట్టు చర్చ జరుగుతోంది. కొత్తవారికి, యువతకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు కోణంలో చూస్తే, కేబినెట్ కూర్పు బాగా జరిగింది. కానీ కూటమి అధికారంలోకి వస్తే, సీనియర్లు అయిన తమకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ఆశించిన నాయకులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పడం లేదు.
సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు , కాల్వ శ్రీనివాస్, అమర్నాథ్‌రెడ్డి, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, దూళిపాళ్ల నరేంద్ర తదితరులంతా మంత్రి పదవుల్ని ఆశించారు. వీరి ఆశను తప్పు పట్టలేం.
అయితే తన వారసుడు లోకేశ్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, మరో రెండు దశాబ్దాల పాటు ఇబ్బంది లేకుండా పటిష్టమైన టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచించారని చెబుతున్నారు. అయితే అనామకులకు మంత్రి పదవులు ఇచ్చారనేది సీనియర్ నేతల ఆరోపణ.
కూటమికి కనీవినీ ఎరుగని రీతిలో బలం ఉండడంతో సీనియర్ నేతలు తమ అసంతృఫ్తిని బయటకు ప్రదర్శించలేకపోతున్నారు. బహుశా చంద్రబాబునాయుడి ధైర్యం కూడా ఈ బలమే కారణం కావచ్చు. ఇప్పుడు కాకపోతే, మరెప్పటికీ కొత్త వాళ్లను మంత్రులుగా చేయలేమని ఆయన భావించినట్టున్నారు. సీనియర్ నేతల మనసుల్లో ఏమున్నా… నోరు తెరిచే పరిస్థితి లేకపోవడం చర్చనీయాంశమైంది.