మనిషిని మనిషి ఎందుకు దోచుకుంటాడంటే, మనిషిని మనిషి తినలేడు కాబట్టి. జంతువులు పరస్పరం, చేపలు ఒకరిని ఇంకొకరు తినేస్తాయి. అది అటవీ న్యాయం, సముద్ర ధర్మం. మనం న్యాయం, ధర్మం గురించి చట్టాలు రాసుకున్నాం. దాని ప్రకారం బలవంతుడు, బలహీనున్ని దోచుకుంటాడు. ఒక పేదవాడు జైలుకెళితే వాన్ని ఎవరూ కాపాడరు. ఎందుకంటే అతని తరపున మాట్లాడే లాయర్లకి డబ్బులివ్వాలి. అదే వుంటే అతను పేద ఎందుకు అవుతాడు?
పేదలకి తమ యధాతథ స్థితి గుర్తు రాకుండా వుండాలంటే అతనికో ఆశ కల్పించాలి. కలల్ని అమ్మాలి. అదృష్ట సిద్ధాంతం బోధించాలి. జీవితంలో పైకి రావాలంటే 176 మెట్లు అనే పుస్తకం రాయాలి. నిచ్చెన లేకుండా చేసి, ఎత్తుకు ఎదగమని ఆహ్వానించాలి. అతను గాల్లో ఎగిరితే తప్ప సాధ్యం కాదు. ఏమో గుర్రం ఎగరా వచ్చు.
మనుషులందరికీ మార్మిక ప్రతిభ వుంటుందంటారు అయిన్‌రాండ్. మనుషులంతా ప్రతిభతో పుట్టరు. ఆకలితో పుడతారు. అది తీరితేనే కలలైనా, కళలైనా. అయినా ప్రతిభని ఎవరు కొలుస్తారు? ఎలా కొలుస్తారు?
తెల్లారి లేస్తే మంత్రాలు, స్తోత్రాలు కంఠస్తం చేసేవాడికి ఉన్నంత గ్రాహణ శక్తి, అతి వేగంగా చెట్టు ఎక్కి, తేనె తుట్టెని తేగలిగిన ఒక గిరిజన కుర్రాడికి వుంటుందా? బట్టీ పట్టి, అప్పజెప్పడమే ప్రతిభ అయినప్పుడు, సముద్రంతో పోరాడి చేపలు పట్టేవాడు, క్రూర మృగాల నుంచి పశువుల్ని రక్షించుకునే వాడు కూడా ప్రతిభావంతులే అని ఎవరు గుర్తిస్తారు?
జీవితాన్ని ఇతరుల శ్రమతో సుఖవంతం చేసుకునే వాడు మేధావి. జీవితంతో యుద్ధం చేసేవాడు నిరక్షరాస్యుడు, అనాగరికుడు. కొలతల్లోనే ఎక్కడో తప్పుంది.
వేల కోట్ల అధిపతులే చట్టసభల నిండా వుంటే, వాళ్లకి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో అర్థమవుతుందా? వైద్యం అందక, ఆకలి తీరక ఎన్ని లక్షల మంది అకాలంగా చనిపోతున్నారో తెలుసుకోగలరా? పెట్టుబడికి లాభం ఆశించే వాళ్లు జనం కోసం నిలబడతారా? మానవ ముఖం ఉన్న వ్యాపారులు ఎక్కడైనా వుంటారా?
సంపూర్ణ స్వాతంత్ర్యం ఉన్న పెట్టుబడీదారి వ్యవస్థే అన్ని సమస్యలకి పరిష్కారం అని కూడా అయిన్‌రాండ్ అంటారు. కానీ ఎవరి సమస్యలు? ఎవరికి పరిష్కారం? కొందరి ఆస్తులు లక్షల కోట్లకి పెరగడం, కోట్ల మంది పేదరికం దిగువున ఉండడం పరిష్కారమా? కూలీ జనానికి ఎలాంటి హక్కులూ లేకుండా రోజుకు 12 గంటలు పని చేయించడమే పెట్టుబడి స్వాతంత్ర్యానికి అర్థం.
తెలివి, ప్రతిభ దైవదత్తం కాదు. శిక్షణ, వారసత్వం. డబ్బుంటే తెలివి. తెలివి వుంటే డబ్బు. ఒక ట్యాక్సీ డ్రైవర్ రోజుకి 16 గంటలు పని చేసినా కోటీశ్వరుడు కాలేడు, కస్టమర్లని నిలువు దోపిడీ చేస్తే తప్ప.
అందరూ సమానమని పుట్టిన సిద్ధాంతాలు, కొందరు ఎక్కువ సమానం అనుకుని అంతరించాయి. మనిషి తెలివైన జంతువు. అది పీక్కు తిని చంపదు. బతకడానికి సరిపోయే తిండి పెట్టి, పీల్చి పిప్పి చేస్తుంది. చట్టాలు, శాసనాలు అన్నీ పులుల కోసమే, జింకల కోసం కాదు. జింకల్ని ఎందుకు సాకుతారంటే, పులుల ఆకలి కోసం.
జీఆర్ మహర్షి