ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తిరుమలలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ఆయన అన్నారు. తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదని చంద్రబాబు అన్నారు.
2003లో క్లైమోర్ మైన్స్ పేలుళ్ల నుంచి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి తనను కాపాడారని బాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్షం పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తన ధ్యేయమని బాబు అన్నారు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, దాన్ని పేదలకు పంచడం కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుందని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం కోసం పని చేస్తానని గతంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు చెప్పారు.
నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని బాబు అన్నారు. తనపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తిరుమల శ్రీవారి సాక్షిగా ఆయన చెప్పారు. తమపై టీడీపీ దాడులు చేస్తోందన్న వైసీపీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. వైసీపీ వారే దాడులు చేసుకుంటూ ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని ఆయన హెచ్చరించారు. తిరుమలలో గోవింద నామం, ఓం నమో వెంకటేశాయ శ్లోకం తప్ప మరేదీ వినిపించకూడదన్నారు.