బాబుని హీరో చేసిందెవ‌రు?

సినిమాల్లో అయితే హీరోలు, విల‌న్లు ఫిక్స్‌డ్‌గా వుంటారు. తారుమారు కారు. రాజ‌కీయాల్లో వారు వీరు అవుతారు. 2019లో చంద్ర‌బాబుని జ‌నం విల‌న్ అనుకున్నారు. కావాలి జ‌గ‌న్ అని కోర‌స్ పాడారు. బైబై బాబు అంటూ…

సినిమాల్లో అయితే హీరోలు, విల‌న్లు ఫిక్స్‌డ్‌గా వుంటారు. తారుమారు కారు. రాజ‌కీయాల్లో వారు వీరు అవుతారు. 2019లో చంద్ర‌బాబుని జ‌నం విల‌న్ అనుకున్నారు. కావాలి జ‌గ‌న్ అని కోర‌స్ పాడారు. బైబై బాబు అంటూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. జ‌గ‌న్‌ని హీరో అని నెత్తిన పెట్టుకున్నారు. అయితే జ‌గ‌న్ త‌న హీరో పాత్ర‌ని మ‌రిచి విల‌న్ పోర్ష‌న్‌ ఎత్తుకున్నారు. ప‌థ‌కాలు పంచి త‌న‌ని తాను రాబిన్‌హుడ్ అనుకున్నాడు కానీ, జ‌నం ఫీల్ గుడ్‌నెస్ మిస్ అయ్యింద‌ని తెలుసుకోలేక‌పోయాడు.

అధికారం ల‌క్ష‌ణం ఏమంటే క‌ళ్ల‌కి పొర‌లు తెస్తుంది. దానికి తోడు జ‌గ‌న్ ప‌ర‌దాలు క‌ట్టుకున్నాడు. ప‌ర‌దా ఎత్తితేనే క‌దా, నిజ‌మైనా, నాట‌క‌మైనా అర్థ‌మ‌య్యేది. దేవుడి స్క్రిప్ట్ ప్ర‌కారం అంతా త‌న‌కు అనుకూల‌మ‌ని అనుకున్నాడు కానీ, జ‌నం త‌న‌కు స్క్రిప్ట్ ర‌చిస్తున్నార‌ని గ్ర‌హించ‌లేక‌పోయాడు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనే నేను అన్న‌ప్పుడు చ‌ప్ప‌ట్లు కొట్టారు. అయితే అంతా నేనే అంటాడ‌ని ఊహించ‌లేదు. మీడియా సెంట‌ర్ కూల్చివేత రోజే చాలా మంది షాక్ తిన్నారు. ఏదో తేడాగా వుందే అనుకున్నారు. అక్ర‌మ క‌ట్ట‌డం క‌దా కూల్చివేత స‌బ‌బే అని అభిమానులు స‌ర్దుకున్నారు. కానీ ప్ర‌జ‌ల ధ‌నం శిథిలంగా మారింది.

అన్నా క్యాంటీన్ల మూసివేత ఆశ్చ‌ర్యం క‌లిగించింది. పేద ప్ర‌జ‌ల మ‌ధ్య సుదీర్ఘ ఓదార్పు, పాద‌యాత్ర‌లు చేసి ముద్దులు పెట్టుకున్న జ‌గ‌న్‌, నోటి ద‌గ్గ‌ర అన్నం ముద్ద‌ను దూరం చేస్తుంటే విచిత్ర‌పోయారు. బాబు హ‌యాంలో సవ్యంగా , స‌క్ర‌మంగా, న్యాయంగా నిర్వ‌హించిన వాటిలో అన్నా క్యాంటీన్ ముఖ్య‌మైంది. ఎక్క‌డా ఏ రాష్ట్రంలో కూడా పేద‌వాళ్ల క్యాంటీన్‌ని త‌ర్వాతి ప్ర‌భుత్వాలు మూయ‌డం జ‌ర‌గ‌లేదు. బాబుని ఓడించి త‌ప్పు చేశామా? అని బీజం ప‌డింది ఇక్క‌డే. జ‌గ‌న్‌లో విల‌న్ ఛాయ‌లు, బాబులో హీరో ల‌క్ష‌ణాలు స్టార్ట్ అయ్యాయి. హార్డ్‌కోర్ అభిమానులు ఇరువైపులా వుంటారు. కానీ మ‌ధ్య‌స్తంగా వుంటూ ప్ర‌భుత్వాల మీద కోపంతో ఫ‌లితాన్ని శాసించే వాళ్ల‌లో ఆలోచ‌న మొద‌లైంది.

మ‌ద్య‌నిషేధం ద‌శ‌ల వారీ అంటూ ఊద‌ర‌గొట్టి ధ‌ర‌లు పెంచి బ్రాండ్లు లేకుండా చేయ‌డంతో జ‌గ‌న్ బ్రాండ్ ఇమేజ్ త‌రుగుద‌ల మొద‌లైంది. ఓదార్పు, పాద‌యాత్ర‌ల‌కి జ‌నం మ‌ద్యం పంచ‌కుండా వ‌చ్చారా? స‌మీక‌ర‌ణ అంటేనే మ‌ద్యం పంచ‌డంతో మొద‌లవుతుంది. మ‌ద్యం అనేది స‌మాజంలోని ఒక సెక్ష‌న్‌కి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. మెజార్టీ ప్ర‌జ‌ల విష‌యం.

ప‌క్క రాష్ట్రాల నుంచి బైకులు, కార్ల‌లో వ‌స్తున్న ప్ర‌జ‌ల్ని చెక్ పోస్టుల ద‌గ్గ‌ర పోలీసులు దారుణంగా అవ‌మానించ‌డంతో జ‌గ‌న్ గ్రాఫ్ కొంచెం కొంచెం ప‌డుతూ వ‌చ్చింది. ఇసుక వ‌ల్ల ఇబ్బందులు, కార్మికుల అగ‌చాట్లు, నాయ‌కుల దోపిడీ ఇవ‌న్నీ ఒక‌సారైనా జ‌గ‌న్ గ‌మ‌నించి వుంటే హీరో విల‌న్ అయ్యేవాడు కాదు.

సినిమాల్లో హీరో వ‌చ్చి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, ఫైటింగ్‌లు చేయాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటారు. ప్ర‌తిదానికీ స‌జ్జ‌ల అనే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వ‌చ్చి తెర‌మీద క‌నిపిస్తూ వుంటే, బాబు ఎంత సమ‌ర్థుడో అనే ఆలోచ‌న మొద‌లైంది.

జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి అంద‌రికీ డ‌బ్బులిచ్చేశాను, జ‌నం అంతా త‌న వైపే అని పార‌డాక్స్ దోషానికి గురి అయ్యాడు. కానీ జ‌నానికి అన్నిటికంటే ఆత్మ గౌర‌వం ముఖ్యం. నువ్వు భిక్షం వేస్తే ఓటు వేయ‌రు. వారికి మ‌ర్యాద కావాలి, మ‌న‌శ్శాంతి కావాలి.

వ‌ద‌రుబోతుల్ని, క‌బ్జాలు చేసే చోటా నాయ‌కుల్ని గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో జ‌గ‌న్ ఉండే స‌రికి జ‌నంలో ఆగ్ర‌హం కొంచెం కొంచెం పెరిగి జ‌గ‌న్‌లో స‌గం విల‌న్‌, స‌గం హీరోని చూడ‌సాగారు. అదే టైమ్‌కి చంద్ర‌బాబులో అనివార్యంగా హీరోని చూసుకోవాల్సి వ‌చ్చింది.

నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అని సోష‌ల్ ఇంజ‌నీరింగ్ జ‌పాన్ని కొంత కాలం న‌మ్మారు. అయితే అన్ని వూళ్ల‌లో అధికారం ఎవ‌రి చేతుల్లో వుందో గమ‌నిస్తూ వ‌చ్చారు.

అన్నిటికంటే మించిన త‌ప్పు చంద్ర‌బాబు జైలు. ఇది జ‌గ‌న్ అహాన్ని సంతృప్తిప‌ర‌చి వుండొచ్చు. ఒక హీరోకి బ‌దులు జ‌నానికి ఇద్ద‌రు హీరోలు దొరికారు. ప‌వ‌న్ చేతులు క‌లిపారు.

నిజానికి ప‌వ‌న్ నూరుశాతం రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగే హీరో కాదు. అయితే ఎవ‌రు హీరోల‌న్న‌ది స‌మ‌స్య కాదు. జ‌గ‌నే స‌మ‌స్య‌. వ‌ద్ద‌నుకున్నారు. 

ఇప్పుడు జ‌గ‌న్ ఎదురు చూడాల్సింది చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌లో విల‌న్ ల‌క్ష‌ణాల కోసం. వాళ్లు విల‌న్ల‌యితే జ‌గ‌న్ హీరో.

విల‌న్ల‌ని హీరోలుగా, హీరోల్ని విల‌న్లుగా చూడ‌డం కాదు జ‌నం కోరుకునేది. నిజ‌మైన హీరో, వాళ్ల కోసం శాశ్వ‌తంగా పోరాడే హీరో. అత‌ను ఎప్ప‌టికైనా వ‌స్తాడా?