చంద్రబాబు మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ ను తన కొడుకు కంటే ఎక్కువ లాలిస్తున్నారు, బుజ్జగిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఆయనే డిజైన్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నది మాత్రం ఆయన బుర్రకు తప్ప మరెవరికీ అందదు. 2019 మాదిరిగానే మళ్లీ భీమవరంలో పోటీ చేస్తానంటే, సర్వే రిపోర్టులు అన్నీ ముందు పెట్టి పిఠాపురం వెళ్లి పోటీ చేయమని చెప్పింది చంద్రబాబు. ఇది పక్కాగా రెండు పార్టీ వర్గాల బోగట్టా. అక్కడ అప్పటికే బలంగా వున్న వర్మ ను బుజ్జగించి, పవన్ విజయానికి అనుగుణంగా నడిపించినది చంద్రబాబు.
రెగ్యులర్ రాజకీయ విధానాలు ఆలోచించేవారు ఏమనుకున్నారు. పిఠాపురంలోనే పవన్ ను కట్ చేసేస్తారు. ఓ పనైపోతుంది అని లెక్కలు కట్టారు. కానీ అలా చేయలేదు. సిఎమ్ రమేష్ ను అటాచ్ చేసి, కోట్లకు కోట్లు ఖర్చు చేయించి, భారీ మెజారిటీతో అసెంబ్లీకి రప్పించారు పవన్ ను.
పవన్ గెలిచారు. కూటమి గెలిచింది కనుక, పవన్ మంత్రి అవుతారని కొందరు, ఏ పదవీ తీసుకోరని కొందరు అనుకున్నారు. కానీ అంతలోనే హోం మంత్రి అని టాక్ మొదలైంది. హోం మంత్రి అంటే జనాలు అందరికీ క్రేజ్. సిఎమ్ తరువాత ఆ రేంజ్ లో వుంటుందని భావిస్తారు. కానీ పవన్ కు గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, అటవీ శాఖ కేటాయిస్తున్నారని ఇప్పుడు బయటకు వచ్చింది.
ఈ మూడూ కీలక శాఖలు అన్నది పక్కన పెడితే, జనాలకు దగ్గరగా వుండే శాఖలు. హోం మంత్రిగా వుంటే చాలా సమస్యలు వున్నాయి. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా, గత అయిదేళ్లలో జగన్ ను టార్గెట్ చేసినట్లు, ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తారు. పైగా రెడ్ బుక్ వుంది. దాని పర్యవసానాలు వున్నాయి. అవి ఏమాత్రం బాగా లేవు అన్నా పవన్ కే చుట్టుకుంటాయి. అందుకే పవన్ కు నచ్చ చెప్పి హోం ను పక్కన పెట్టారు.
ఇక గ్రామీణాభివృద్ది అంటే చాలా విస్తారమైన శాఖ. పల్లెల అభివృద్ది అంతా ఆ శాఖ అండర్ లోనే. పంచాయతీ రాజ్ అంటే సెమీ అర్బన్ అంతా వస్తుంది. అందువల్ల జనాలతో నిత్యం కలిసి వుండే అవకాశం ఈ రెండు శాఖలకు వుంది. పైగా తరచు ఢిల్లీ వెళ్లి వివిధ స్కీములు, పథకాలు, వరల్డ్ బ్యాంక్, నాబార్డ్ వంటి సంస్ధలతో డిస్కషన్లు అన్నీ వుంటాయి. దీని వల్ల విపరీతంగా ఇటు జనాల్లోనే కాదు, అటు వార్తల్లో కూడా వుంటారు. విపరీతమైన ఎక్స్ పోజర్ వస్తుంది.
చూస్తుంటే ఎప్పటికీ పవన్- లోకేష్ కలిసి చెట్ట పట్టాలు వేసుకుని ముందుకు వెళ్లేలా చంద్రబాబు డిజైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎంత వరకు కొనసాగుతుందన్న ప్రశ్న వుంటుంది. కానీ కొనసాగించేలా చేసే టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు.