ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్‌పై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులైతే రాజకీయంగా వైసీపీ, వైఎస్ జగన్ పని అయిపోయిందని అంటున్నారు. ప్రత్యర్థులు ఆ రకంగా ప్రచారం చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రత్యర్థుల ప్రచారం ఎలా ఉన్నా, వైసీపీ శ్రేణుల్లో కూడా పార్టీ భవిష్యత్‌పై భయం ఉంది. పార్టీ ఏమవుతుందో అనే ఆందోళన శ్రేణుల్ని వెంటాడుతోంది.
వైసీపీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిలో అనూహ్యమైన సానుకూల మార్పు రావాల్సి వుంది. అప్పుడే వైసీపీ తిరిగి బలపడుతుంది. మొట్టమొదటగా వైఎస్ జగన్ అందరితో మాట్లాడాలి. తానో సామాన్య నాయకుడని భావిస్తే తప్ప, వైసీపీకి పుట్టగతులుండవని చెప్పక తప్పదు. జగన్‌ను దేవుడ్ని చేసి, ఎవరికీ కనిపించకుండా, ఇంట్లోనే కూచో పెడితే కార్యకర్తలెవరూ మిగలరు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ బయటికొచ్చి, తానున్నానని భరోసా ఇచ్చేలా కార్యకర్తలు, నాయకులతో మమేకం అయితేనే, తిరిగి వారిలో నూతన ఉత్తేజం కలుగుతుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కోరుకున్నది జగన్ పలకరింపు మాత్రమే. దానికి కూడా గత ఐదేళ్లలో నోచుకోలేదు. అందుకే ఎన్నికల్లో ఉత్సాహంగా వారు పని చేయలేదు. ఇక నాయకుల సంగతి సరే సరి.
గత ఐదేళ్లలో కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. సీఎం కాగానే, వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని పట్టించుకోకూడదని జగన్ ఎందుకు అనుకున్నారో ఆయనకే తెలియాలి. మేనిఫెస్టోను అమలు చేస్తున్నానని, ప్రజలంతా తన పాలనపై ఫీల్ గుడ్ అభిప్రాయంతో ఉన్నారని జగన్ కల కన్నారు. చివరికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు జగన్ రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే, తనను తాను చాలా మార్చుకోవాల్సి వుంటుంది. తన పార్టీ వాళ్లతోనే కాకుండా, ఇతర పార్టీలతోనూ కలుపుగోలుగా వుండాలి. రాజకీయాల్లో ఒంటరితనం మంచిది కాదు. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు. అంత మాత్రాన శత్రువైఖరితో వుండాల్సిన పనిలేదు. జగన్ తీరుతో మిగిలిన పార్టీలకు వైసీపీ శత్రువైంది.
రాజకీయ వ్యతిరేకులెవరో జగన్ గుర్తించాలి. దానికి కారణాలను విశ్లేషించుకోవాలి. వ్యతిరేకులతో మాట్లాడి, సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. అందరితో జగన్ బాగుంటున్నాడనే వాతావరణం ఏర్పరచుకోవాలి. జగన్‌లో చాలా మార్పు వచ్చిందనే సానుకూల పవనాలు బలంగా వీచేలా చూసుకోవాలి. జగన్ కక్షతో వ్యవహరిస్తారనే అభిప్రాయాన్ని పోగొట్టుకునేలా నడుచుకోవాలి.
గత ఐదేళ్ల పాలనలో చేసిన తప్పుల్ని పునరావృతం చేయననే నమ్మకాన్ని జనంలో కల్పించడం అన్నింటికంటే ముఖ్యమైంది. అప్పుడే ప్రజాదరణ పొందే అవకాశం వుంటుంది. తాను చెప్పిందే జనం వింటారని, వారికి ఆలోచనలు, అభిప్రాయాలుండవనే మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి. తనకు తెలిసింది తక్కువ, జనం నుంచి నేర్చుకోవాల్సింది ఎక్కువ అని జగన్ గ్రహించాలి. ఇంత వరకూ సీఎంగా అధికార హోదాలో వుండడంతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తాను చెప్పిందల్లా విన్నారని, ఇకపై అలా వుండదని జగన్ గుర్తించాలి.
ఇప్పటికీ తన అభిప్రాయాన్ని వైసీపీ కేడర్‌పై రుద్దేందుకు ప్రయత్నించొద్దు. ఓటమికి కారణాలను వైసీపీ కార్యకర్తలు, నాయకుల నుంచి తెలుసుకోవాలి. మొదటగా కుటుంబంలో విభేదాల్ని చక్కదిద్దుకోవాలి. తన ప్రత్యర్థులు అత్యంత శక్తిమంతులని గ్రహించాలి. రానున్న రోజుల్లో వారిని ఎదుర్కొని నిలబడాలంటే, వైసీపీ కార్యకర్తలు, నాయకుల అండదండలే కీలకం. కావున సాధ్యమైనంత త్వరగా వారిని కలిసి మద్దతు కూడగట్టుకోవడం అవసరం.
పార్టీ వాయిస్‌గా సమాజంలో గౌరవం ఉన్న వైసీపీ నాయకులను ముందుకు తేవడం అవసరం. ఇప్పటికైనా బూతులు మాట్లాడే నేతల నోర్మూయించాలి. వైసీపీ అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన పార్టీ అనే నెగెటివ్ ముద్ర నుంచి బయట పడేందుకు తీవ్ర కసరత్తు చేయాల్సి వుంటుంది. ఐదేళ్లలో చేసిన తప్పిదాలపై సమీక్షించుకోవాలి.
కొన్ని వర్గాలను పూర్తిగా దూరం చేసుకోవాల్సిన పరిస్థితులపై అధ్యయనం చేసుకోవాలి. తిరిగి ఆ వర్గాలకు చేరువ అయ్యేందుకు స్వయంగా జగనే చొరవ చూపాలి. ఉద్యోగులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. జగన్‌కు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలకు డబ్బు జమ చేయడానికి బటన్ నొక్కడం తప్ప, ఏమీ చేతకాదనే మెజార్టీ ప్రజానీకం మనసుల్ని గెలుచుకునేలా తనలో మార్పును జగన్ చూపాలి. పోయిన చోటే అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలంటే… జగన్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలి. పూర్తిగా తనను తాను మార్చుకుంటే తప్ప, రాజకీయంగా భవిష్యత్ వుండదు. ప్రజల అవసరం తనకు వుందని జగన్ గ్రహించాలి.
అంతే తప్ప, తాను లేకపోతే ప్రజలకు మరో నాయకుడు లేడని జగన్ అనుకోవద్దు. ఎందుకంటే కాలగర్భంలో ఎందరో నాయకులు కలిసిపోయారు, పుట్టుకొచ్చారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేరని అనుకుంటే ఎంతటి నాయకుడినైనా జనం మరిచిపోతారు. కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తారు. అంతా కాల మహిమ. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకున్న వారే నిలుస్తారు. ఆ సూక్ష్మాన్ని గుర్తిస్తేనే ఎవరికైనా భవిష్యత్.