తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసైకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వార్నింగ్ ఇవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబునాయుడు, ఆయన కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ జాతీయ అగ్రనేతలతో పాటు తమిళిసై కూడా హాజరయ్యారు.
సభా వేదికపై ప్రముఖులకు తమిళిసై నమస్కారం చేస్తూ ముందుకెళుతుండగా, అమిత్‌షా ఆమెని పిలిచారు. ఫలానా విషయమని తెలియదు కానీ, వాళ్లిద్దరి మధ్య హావభావాలు చూస్తే , తమిళిసైని హెచ్చరించినట్టు అర్థమవుతోంది. తమిళిసై మాటలతో ఏకీభవించనట్టు అమిత్‌షా అడ్డంగా తలూపుతూ కనిపించారు. వేలు చూపుతూ ఆమెను హెచ్చరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన తమిళిసై తెలుగు సమాజానికి సుపరిచితురాలు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి, తమిళనాడుకు వెళ్లి చెన్నైలో పార్లమెంట్‌కు పోటీ చేశారు. అయితే ఆమె ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో తమిళిసైకి తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. అన్నామలైపై ఆమె బహిరంగ విమర్శలు చేశారు. బహుశా తమిళనాడు బీజేపీలో విభేదాలే తమిళిసైకి వార్నింగ్ ఇచ్చి వుండొచ్చనే చర్చ జరుగుతోంది.
అమిత్‌షాకు అన్నామలై దగ్గరి మనిషిగా పేరు వుంది. అలాంటి వ్యక్తితో తమిళిసై గొడవ పెట్టుకోవడం సహజంగానే అమిత్‌షాకు కోపం తెప్పించి వుంటుందని అంటున్నారు. ఇదిలా వుండగా సభావేదికపై తమిళిసైని అమిత్‌షా హెచ్చరించడంపై డీఎంకే తప్పు పడుతోంది. తమిళ మహిళను అవమానించే రీతిలో అమిత్‌షా వ్యవహరించారని డీఎంపీకే నేతలు విమర్శించడం గమనార్హం. బీజేపీని బద్నాం చేయడానికి ఈ ఘటనను డీఎంకే వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.