అధికారం.. రాజకీయం.. చెట్టాపట్టాల్!

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు వుండరు. ఆ సంగతి తెలిసింది. అధికారాన్ని పెనవేసుకుని వుంటుంది రాజకీయం. 2014లో చంద్రబాబు చేయి పట్టుకున్నారు మోడీ. 2019కి వచ్చే సరికి జగన్ తో భుజం కలిపి…

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు వుండరు. ఆ సంగతి తెలిసింది. అధికారాన్ని పెనవేసుకుని వుంటుంది రాజకీయం. 2014లో చంద్రబాబు చేయి పట్టుకున్నారు మోడీ. 2019కి వచ్చే సరికి జగన్ తో భుజం కలిపి నడిచారు. ఎందుకంటే పార్లమెంట్ లో అనేకానేక బిల్లులు గట్టెక్కించింది వైకాపాకు వున్న పార్లమెంట్ సభ్యుల బలం. 2024 కు వచ్చేసరికి చంద్రబాబు చెంతకు చేరారు మళ్లీ.

తనను ఎంతగా విమర్శించారో, ఎంతగా ట్రోల్ చేసారో అంతా మరిచిపోయారు మోడీ. పాచిపోయిన లడ్లు అన్న మాటే గుర్తు లేదు పవన్ కు. ఎందుకంటే పవన్, బాబు ల ఎంపీలు మోడీకి కావాలి. మోడీ కు వున్న అపరిమిత బలం తోడు కావాలి బాబు అండ్ పవన్ కు.

అంతా గాలి వాటం. గాలి ఎటు వుంటే ఆ వాలున వెళ్తేనే రాజకీయం సాగించగలం. అలా చేయకుండా 2019 లో తనను వదిలేసారని మోడీ కనుక చంద్రబాబు దగ్గరకు వెళ్లకుండా వున్నా, లేదా జగన్ ఏమనుకుంటాడో అని ఫీలయి, అతని వెంటే వున్నా, ఇఫ్పుడు కేంద్రంలో అధికారం దగ్గర తేడా వచ్చేసేది.

చేతిలో సరైన ఇంటిలిజెన్స్ వ్యవస్థను పెట్టుకున్న వాళ్లు బయట ఏం జరుగుతోందో సరిగ్గా గమనించగలగాలి. మోడీ అలా గమనించారు కనుకనే చంద్రబాబు చేయి పట్టుకున్నారు, జగన్ చేయి వదిలేసి. అలా గమనించలేకపోయారు కనుకే జగన్ ఓడిపోయారు. పాచిపోయిన లడ్లు ఇచ్చారు అన్న పవన్ చేతినే నవ్వుతూ పట్టుకుని ఫొటొలకు ఫోజులు ఇచ్చారు మోడీ. అసలు ఏ హామీ తీసుకుని, స్నేహం చేస్తున్నారో చెప్పకుండానే మోడీ అంటే అమిత గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్. అదే రాజకీయం అంటే.

అధికారం కోసమే రాజకీయం వుంటుంది. అధికారం వున్న చోటనే రాజకీయం వుంటుంది. అవసరాల కోసమే రాజకీయం. అంతే తప్ప అనుబంధాలు, స్నేహాలు, ఇగోలు, ఇంకోటీ కాదు. ఇప్పటికైనా అనుభవం అయి వుంటుందేమో? జగన్ కు?