ఉమ్మడి కర్నూలు జిల్లాలో గంగుల కుటుంబానికి ప్రాధాన్యం వుంది. ఆళ్లగడ్డలో భూమా, గంగుల కుటుంబాల మధ్య సుదీర్ఘ కాలంగా రాజకీయ పోరు నడుస్తోంది. భూమా, గంగుల కుటుంబాలు ఒకే పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఇమడలేవు. గతంలో వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ …టీడీపీలో చేరారు. దీంతో టీడీపీలో ఉన్న గంగుల కుటుంబం వైసీపీలో చేరింది.
2019లో ఆళ్లగడ్డలో గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో నాటి మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి రుచి చూశారు. ఈ ఎన్నికల్లో రివర్స్ ఫలితాన్ని ఆళ్లగడ్డలో చూడొచ్చు. వైసీపీలో కీలకంగా వుండే గంగుల కుటుంబ అల్లుడు ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రి కావడం విశేషం. గంగుల మనోహర్‌రెడ్డి అల్లుడే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి. మనోహర్‌రెడ్డి కుమార్తెకు రామ్ప్రసాద్రెడ్డితో వివాహం జరిగింది. ఆ రకంగా ఆయన గంగుల అల్లుడయ్యారు.
వైఎస్సార్ జిల్లా రాయచోటిలో సిటింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని రామ్‌ప్రసాద్‌రెడ్డి ఓడించారు. ఇప్పుడాయన్ను చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డికి మనోహర్‌రెడ్డి సోదరుడు.
వైసీపీలో గంగుల కుటుంబం ఉన్నప్పటికీ, వారి అల్లుడు మాత్రం ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి బలమైన నాయకుడు. శ్రీకాంత్‌రెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చాడు. శ్రీకాంత్‌ను ఓడించిన రామ్‌ప్రసాద్‌రెడ్డికి బాబు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.