నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూసిన మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా … మొదటి సంతకం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగే రూ.4 వేల పింఛన్ పెంపునకు సంబంధించిన పైళ్లపై చంద్రబాబు సంతకం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో ఏపీ ప్రజానీకంలో తన పాలనపై విశ్వాసం కలిగించేలా చెరగని సంతకం చంద్రబాబు చేస్తారని అంతా భావించారు. అయితే అలాంటి దృశ్యం ఆవిష్కరణ కాకపోవడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ, చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులెవరూ ప్రమాణ స్వీకార సభా వేదికపై నుంచి ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వకపోవడం గమనార్హం.
చంద్రబాబు చేసే తొలి సంతకంపై వైసీపీ నాయకులు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూశారు. తాను మారిన చంద్రబాబుగా ఇటీవల కాలంలో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే బాబు ఏం చెప్పినా నమ్మరని జగన్ పదేపదే అంటూ వచ్చారు. కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలనే జనం నమ్మి ఓట్ల వర్షం కురిపించి, అందలం ఎక్కించారు.
బాబు మనసులో ఏముందో తెలియదు కానీ, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మాత్రం ఆయన హామీల అమలుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయకపోవడం చర్చనీయాంశమైంది. అయితే ఇంతటితోనే ఏదో అయిపోయిందని అనుకోనవసరం లేదు. బహుశా ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుందనే మాట వినిపిస్తోంది.
ఇదిలా వుండగా ప్రమాణ స్వీకారంపై నిరుద్యోగ టీచర్లు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. మెగా డీఎస్సీకి సంబంధించిన ఫైల్‌పై బాబు సంతకం పెడతారని వారు ఆశిస్తే, మెగా ఫ్యామిలీని చూస్తూ సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే మాట వినిపిస్తోంది. మంత్రిగా పవన్ బాధ్యత తీసుకునే వేడుకకు మెగా కుటుంబ సభ్యులంతా హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిని చూడడం జనానికి వినోదం.