కూటమి ప్రభుత్వం కొలువుదీరుతున్న సందర్భంలో వేదికపై ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. రకరకాల ఆలోచనలను రేకెత్తించింది. మంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్, ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు.
చిరు, పవన్‌ను నవ్వుతూ పలకరించారు. మోదీ పలకరింపునకు మెగా బ్రదర్స్ ఫిదా అయ్యారు. ఇదే సందర్భంలో చిరు, పవన్ చేతుల్ని మోదీ తీసుకుని పైకెత్తి అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం భవిష్యత్ రాజకీయ మార్పునకు ప్రతిబింబం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రానున్న రోజుల్లో బీజేపీ రాజకీయ అవసరాల రీత్యా చిరంజీవని కూడా కలుపుకుని వెళ్లే అవకాశాలున్నాయనే చర్చకు తెరలేచింది. రాజకీయాలు నిత్యం మారుతూ వుంటాయి. ఈ రోజున్న పరిస్థితులు రేపు వుంటాయనే నమ్మకం లేదు. ఎప్పుడూ ఒకర్నే నమ్ముకుంటే, నష్టపోవాల్సి వుంటుంది. అందుకే మోదీ, అమిత్‌షా ఎప్పుడూ అప్రమత్తంగా వుంటారు. వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను తమ అదుపులో వుంచుకుంటుంటారు.
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను ప్రధానంగా ముందుకు పెట్టి భవిష్యత్‌లో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడే అవకాశాలు లేకపోలేదు. చిరంజీవిని కూడా కలుపుకుంటే, రాజకీయంగా పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ నమ్ముతోంది. ఎందుకంటే మెగా బ్రదర్స్ ఏపీలో బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధులుగా బీజేపీ చూస్తోంది. అందుకే ప్రమాణ స్వీకార వేదికపై మెగా బ్రదర్స్‌కు విశేష ప్రాధాన్యాన్ని మోదీ ఇచ్చారని పలువురు అంటున్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు తాను పంపదలుచుకున్న సంకేతాలను మోదీ చేరవేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.