కొత్త ప్రభుత్వం వచ్చేసింది. చంద్రబాబు సారధి. పవన్ కళ్యాణ్ ఉపసారధి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు ప్రాంతీయ పార్టీల సంకీర్ణంలో ఇది మొట్టమొదటి ప్రభుత్వం. పైగా ప్రతిపక్ష నాయకుడు లేని ప్రభుత్వం. 175లో 164 సీట్లతో నిండైన పాలకపక్షం. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం. ముందుగా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయనే దానిపై కాస్త ఆలోచిద్దాం.
నిజానికి ప్రభుత్వం మారగానే అప్పటి వరకూ నిస్పృహతో ఉన్న పార్టీకి జవసత్వాలు, ఉత్తేజంగా ఉన్న పార్టీ నీరసం కలగడం సహజం. సీన్ రివర్స్ అయ్యి ఆ వర్గం వాళ్లు ఈ వర్గం వాళ్లని ర్యాగింగ్ చేస్తుంటే చూడాలనే నైజం కొందరిలో ఉండొచ్చు. కానీ ఆ విషయంలో సాధ్యాసాధ్యాలేంటో చూద్దాం.
కూటమి ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకోవడం కష్టం. ఎందుకంటే చాలామంది ఉన్నారు. కనుక వైకాపా ఎమ్మెల్యేలెవరో ఒక్కసారి చూద్దాం.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెడితే మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లు ఒక్కసారి చూడండి- బి. విరూపాక్షి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, విశ్వేశ్వర రాజు, అమర్నాథ రెడ్డి, ద్వారకానథ రెడ్డి, రేగం మత్యలింగం, బాలనాగిరెడ్డి, దాసరి సుధ, తాటిపర్తి చంద్రశేఖర్.
అర్థరథులు, రథులు, శతరథులు, మహారథులు అందరూ యుద్ధంలో వీరస్వర్గం పొందాక మిగిలిన బంటుల్లాంటి వాళ్లు ఈ తొమ్మిది మంది. తరచూ రాజకీయ వార్తలు చూసేవాళ్లకి కూడా వీళ్లెవరో చాలామందికి తెలీదు. రాజకీయంగా ఉనికిని చాటుకున్న వ్యక్తులు కారు వీళ్లు. వీరిపై పాలకపక్ష దిగ్గజాలు ఏమంత విరుచుకుపడతారు? విరుచుకుపడడానికి పాయింటేముంటుంది?
ఇక చెప్పుకోవడానికి మిగిలిన పెద్ద తలకాయలెవరంటే జగన్ మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి. వీరిద్దరూ అసెంబ్లీ సమావేశాలకొస్తారా? లేక తెలంగాణలో కేసీయార్ మాదిరిగా దూరంగా ఉంటారా? ఏమో తెలీదు! వాళ్లు గైర్హాజరు కాకుండా రావాలనే పాలకపక్షం కోరుకుంటుంది. అది సహజం. తమ నాయకుడిని అసెంబ్లీలో అవమానకరమైన మాటలతో విజృంభించిన దానికి ప్రతిదాడి చెయ్యాలని వాళ్లకి ఉండనే ఉంటుంది. ఆ అవకాశం జగన్ ఎంతవరకు ఇస్తారో చూడాలి. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఆ మాటల దాడిని ఎలా ఎదుర్కుంటారో కూడా చరిత్ర చూస్తుంది.
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనుకున్నా, ఇన్నాళ్లూ ఉంటే ఏమయ్యిందో చూసాం. మాటల దాడులు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, ఏడుపులు.. వీటితోనే సరిపోయింది. కనుక ప్రతిపక్షం ఉన్నా లేనట్టే అన్నట్టున్న ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని, పూర్తి సమయం ప్రజా ప్రయోజన విషయాలపట్లే తప్ప వృధా కాకుండా ఉంటుందని ఆశించవచ్చు.
ఆ విషయం పక్కన పెడితే ఈ కొత్తపభుత్వంపై అత్యధిక ప్రజలకి గంపెడాశలైతే ఉన్నాయి.
మొట్టమొదటిగా రాజధాని సమస్య. తెదేపాకి మొదటి నుంచీ అమరావతిపైనా దృష్టి. ఆ దిశగా పావులు కదిపినా 2014-19 మధ్య తాత్కాలిక బిల్డింగులతోటి, గ్రాఫిక్స్ తోటి కాలయాపన చేసారాన్న అపవాదు ఉంది. ఈ దఫా అలా కాకుండా సత్వరమే అన్ని రకాలుగా పనులు మొదలుపెట్టి అభివృద్ధి దిశగా పయనించి రాష్ట్రానికి కొత్త దశని చూపించాలి. వన్స్ ఫర్ ఆల్, ఇక క్యాపిటల్ సమస్యకి చరమగీతం పాడాలి.
మరొకటి పోలవరం. కేంద్ర నిధులతో కట్టాల్సిన ప్రాజెక్టు అది. కేంద్రంపై ప్రస్తుతం చంద్రబాబుకి ఉన్న పట్టుని వాడి ఆ నిథుల్ని వెంటనే తీసుకురాగల్గితే ఓకే. ఏ మాత్రం ఆలస్యమవుతున్నా పవన్ కళ్యాణ్ గతంలో సూచించినట్టు ప్రజలపై “పోలవరం సెస్” విధించి త్వరితగతిన ఆ ప్రాజెక్టుని పూర్తి చేసి ఇక ఆ టాపిక్ ని కూడా క్లోజ్ చేయాలి.
ఈ రెండూ పూర్తవుతూ ఉండగానే రాష్ట్ర రహదారులు, ఊళ్లల్లో రోడ్లు “స్మార్ట్ సిటీ” ల స్థాయిలో నిర్మించాలి.
వీటితో పాటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎం.ఓ.యులు చేసుకున్న అరవై పై చిలుకు కంపెనీలు ఏవైతో ఉన్నాయో అవన్నీ పెట్టుబడులు పెట్టి వాటి వాటి వ్యాపారాలు మొదలయ్యేలా చూడాలి. పనిలో పనిగా కొత్త ఎమ్మెన్సీలు, ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి అమరావతిలోనూ, వైజాగులోనూ, రాజమండ్రిలోనూ, తిరుపతిలోనూ, కర్నూలులోనూ పెట్టించగలగాలి. వీటి వల్ల ఆ ఊళ్లకు రద్దీ పెరిగి నగరీకరణ, విమానాశ్రయాల అభివృద్ధి మొదలైనవి కూడా సమీప భవిష్యత్తులో జరపడానికి ఆస్కారముంటుంది.
ఇవన్నీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సత్వరం కోరుకునేవి. ఈ వర్గం వారికి ఉచితాలు అవసరం లేదు, ఆశించరు. పేదలకి ఊరికే ఇస్తున్నా కూడా వీళ్లకి నచ్చదు. “అమ్మ ఒడి” ఒకరికిస్తేనే చిరాకు పడిన ప్రజలు ఈ వర్గంలో ఉన్నారు. మరి చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామన్నారు. దాని పర్యవసానమేంటో, ఇవ్వాల్సిన అవసరం ఎంత వరకూ ఉందో..రాష్ట్ర ఖజానాని, చేయాల్సిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేయాలని ఈ వర్గం ప్రజల ఆకాంక్ష.
ఇక పేదల్లో మునుపటి ప్రభుత్వం కంటే ఎక్కువ ఉచితాలకి ఆశపడి ఓట్లేసిన వాళ్లున్నారు. వీరందరినీ సంతృప్తి పరుస్తూ, వారికి ఉచితాలకంటే ఎక్కువగా వ్యాపారాల ద్వారా, పనుల ద్వారా సంపాదించుకోగలిగే వాతావరణాన్ని సృష్టించగలగాలి.
“సంపద సృష్టించి సంక్షేమం చేస్తాం”, “చేపల్ని పంచడం కాదు- చేపల్ని పట్టడం నేర్పిస్తాం” లాంటి స్లోగన్స్ తో ప్రచారం చేసిన విధంగా ఆ పనులన్నీ చేసి చూపిస్తే ఆంధ్రప్రదేశ్ యావద్దేశానికే తలమానికంగా మారుతుందని వేచి చూస్తున్న ప్రజలున్నారు. అలా చేయగలరన్న నమ్మకం చంద్రబాబుపై ఉంచారు. అందుకే గెలిపించారు.
ఇంతకీ “నాడు నేడు” పథకంలో రూపు మార్చుకున్న ప్రభుత్వ పాఠశాలల్ని కొనసాగిస్తారా లేక వదిలేస్తారా అనేది చూడాలి. దీనిపై చంద్రబాబు ఆలోచనేమిటో స్పష్టత లేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్లీ తెలుగు మీడియం చదువుల్ని తీసుకొస్తారా అనేది కూడా ప్రశ్నార్ధకమే. “జిల్లాకొక మెడికల్ కాలేజీ” అనే వైకాపా ప్రభుత్వ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తారా లేక ఆపేస్తారా అనేది కూడా వేచి చూడాలి.
ఇక కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకునే ముందు గొడవలు, అల్లర్లు, హత్యలు వంటి అపశ్రుతులు నిజంగా బాధాకరం. రానున్న రోజుల్లో ఇవి పూర్తిగా సమసిపోతాయని ఆశించాలి. ప్రజాస్వామ్యంలో ఓడిన వర్గానికి బాధ సహజం. గెలిచిన వర్గానికి సంతోషమూ సహజం. ఆ రెండూ వాళ్లని మింగేయకూడదు. సంయమనం పాటించాలి. రాజకీయ విభేధాలతో ఎంత గొడవపడ్డా అందరూ ఆంధ్రప్రదేశ్ బిడ్డలమే అనే వాస్తవాన్ని మరిచిపోకూడదు.
కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు వంటి భావోద్వేగాల్ని సినిమా తెరలకి పరిమితం చేయాలి తప్ప నిజ జీవితంలోకి తీసుకురాకుండా నిగ్రహించుకునే శక్తిని అలవరుచుకోవాలి ఎవరైనా. అప్పుడే ఒక వికాసవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. పాలకపక్షం ఆ ప్రయత్నాలు కూడా చేస్తారని కోరుకుందాం.
– పద్మజ అవిర్నేని