పుష్ప విడుదల టైమ్ లో కూడా ఇదే టెన్షన్. అనుకున్న డేట్ కు వస్తుందా? రాదా? అని. కానీ హీరో బన్నీ పట్టు పట్టుకుని కూర్చున్నారు. మరో హీరో ఎవరైనా ఆ సినిమా అలా అనుకున్న డేట్ కు వచ్చేది కాదు. ఎందుకంటే అక్కడున్నది దర్శకుడు సుకుమార్. లాస్ట్ మినిట్ వరకు ఇంకా క్వాలిటీ చెక్, పెర్ ఫెక్షన్.. ఇంకా.. ఇంకా..
ఇప్పుడు పుష్ప 2 కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటోందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఆగస్ట్ 15న విడుదల డేట్ గా ఫిక్స్ చేసారు. కానీ ఆ డేట్ కు రావడం అనే దాని మీద హీరో- నిర్మాత- దర్శకుడి మధ్య చాలా పంచాయతీలు నడిచాయని తెలుస్తోంది. తనను వత్తిడి చేయవద్దు, ఆగస్టు 15 కు రావడానికే ట్రయ్ చేస్తాను అంటూ దర్శకుడు సుకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. తనను గాభరా పెట్టవద్దని, పార్ట్ వన్ విషయంలో కూడా అలా వత్తిడి చేసారని, కాస్త డివైడ్ టాక్ వచ్చిందని, ఈసారి అలా కాకూడదని దర్శకుడు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
కానీ నిర్మాత నవీన్, హీరో బన్నీ మాత్రం ఆరు నూరైనా ఆగస్ట్ 15 కు సినిమా విడుదల కావాల్సిందే అని క్లియర్ గా చెప్పేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప 2 షూట్ వర్క్ జూలై మూడో వారం వరకు వున్నట్లు తెలుస్తోంది. నటుడు రావు రమేష్ ఈ షూట్ కోసం వేరే సినిమాల నిర్మాతలను అడ్జస్ట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
మరి జూలై మూడో వారం వరకు షూట్ వుంటే, పోస్ట్ ప్రొడక్షన్, ఇతరత్రా పనులకు మూడు వారాలు సరిపోతుందా? పుష్ప టైమ్ లో కూడా దర్శకుడు సుకుమార్ ప్రచారంలో పాల్గొనేందుకు టైమ్ సరిపోలేదు. బన్నీ నే అన్నీ చూసుకున్నారు. ఈసారి నార్త్ బెల్ట్ లో గట్టిగా ప్రచారం చేయాల్సి వుంది. ఇప్పుడు వున్న రెండు నెలల సమయం సరిపోతుందా? అన్నది చూడాలి.