ఇవాళ చంద్రబాబునాయుడి ప్రభుత్వం కొలువుదీరనుంది. మంత్రుల జాబితా విడుదలైంది. టీడీపీ సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడికి చోటు లేదు. ఇది ఊహించని పరిణామం. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్లిద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని అంతా ఊహించారు. అయితే చంద్రబాబు మాత్రం భిన్నంగా ఆలోచించారు. సీనియర్ నేతలైన వాళ్లిద్దరినీ చంద్రబాబు పక్కన పెట్టారు.
రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవి ఆశిస్తున్నారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో తనకు చోటు కల్పించలేదని, ఈ దఫా తప్పక అవకాశం ఇవ్వాలని, ఇస్తారని ఆయన గంపెడు ఆశ పెట్టుకున్నారు. తీరా మంత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఐదు బెర్త్‌లు కల్పించారు. దీంతో గోరంట్లకు అవకాశం లేకపోయిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గోరంట్లకు చంద్రబాబు మరోలా అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు.
అయితే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసే సందర్భంలో చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేశారని, అందువల్లే ఆయన్ను పక్కన పెడుతూ వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజానిజాలేంటో బుచ్చయ్య, చంద్రబాబుకే తెలియాలి.
ఇక అయ్యన్నపాత్రుడి విషయానికి వస్తే …టీడీపీలో సీనియర్ నేత. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా వుంటున్నారు. టీడీపీ కష్టకాలంలోనూ ఆయన అండగా నిలబడ్డారు. కేసులు పెట్టించుకున్నారు. ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆయన్ను పక్కన పెట్టి, కొత్తగా కొందరు బీసీ నేతల్ని చంద్రబాబు ప్రోత్సహిస్తుండడం గమనార్హం.