కూటమి కొత్త మంత్రులెవరో తేలిపోయింది. ఇక ప్రమాణ స్వీకారమే మిగిలి వుంది. సీఎంగా చంద్రబాబునాయుడు, మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇవాళే శుభముహూర్తం. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి అదృష్టవంతులనే చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలో చేరి, ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇప్పుడు బాబు కేబినెట్‌లో మంత్రి పదవులను కూడా దక్కించుకోవడం చర్చనీయాంశమైంది.
గతంలో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ తరపున ప్రాతినిథ్యం వహించారు. మంత్రి పదవిని ఆశించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆనం కుటుంబానికి పలుకుబడి వుంది. ఆనం రామనారాయణరెడ్డి గతంలో పలువురి కేబినెట్లలో మంత్రిగా పని చేసిన అనుభవం వుంది. పెద్ద మనిషిగా ఆయనకు గుర్తింపు. అయితే ఆయన్ను జగన్ పట్టించుకోలేదు.
మొదటి నుంచి తన వెంట నడిచిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ వైపు జగన్ మొగ్గు చూపారు. దీంతో ఆనంలో అసంతృఫ్తి ఉంటూ వచ్చింది. ఎన్నికలు సమీపించే సమయానికి వైసీపీలో ఇమడలేని పరిస్థితి. వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఆత్మకూరు బరిలో నిలిచి, గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా దక్కించుకున్న అదృష్టజాతకుడయ్యారు.
ఇక కొలుసు పార్థసారథి విషయానికి వస్తే… అదృష్టవంతుడనే చెప్పాలి. ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు. 2019లో వైసీపీ తరపున పెనమలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిటింగ్ ఎమ్మెల్యే అయిన పార్థసారథికి ఈ దఫా టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. దీంతో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా బాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఆనం, కొలుసు మంత్రి పదవులు దక్కించుకున్న నేతలుగా అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.