చంద్రబాబు కొత్త కేబినెట్‌పై విస్తృత చర్చకు తెరలేచింది. ఫలానా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెడ్ల ప్రజాప్రతినిధులకు చంద్రబాబునాయుడు ఝలక్ ఇచ్చారు. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో వైసీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అది కూడా పెద్దిరెడ్డి సోదరులు మాత్రమే.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ తరపున రెడ్ల నాయకుల్లో శ్రీకాళహస్తి, పలమనేరు, పీలేరు నియోజక వర్గాల నుంచి బొజ్జల సుధీర్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. వీరిలో ఎవరో ఒకరికి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని కొన్ని రోజులుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణల రీత్యా చంద్రబాబు తప్పక అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు.
అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెడ్లకే కాదు, ఇతర సామాజిక వర్గ నాయకులకు అవకాశం ఇవ్వలేదు. కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో, ఇక ఆయన ఒక్కడితోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. తానే ముఖ్యమంత్రిగా వుండగా, ఇతర మంత్రులెందుక అనే ధోరణి బాబులో కనిపించింది.
రెడ్ల విషయానికి వస్తే… కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి గెలుపొందిన ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. దీంతో చిత్తూరు జిల్లా నేతలకు నిరాశే మిగిలింది.