చంద్రబాబు మంత్రి వర్గ కూర్పు పూర్తయింది. జగన్ ను చూసి నేర్చుకున్నట్లున్నారు. అందుకే కీలకమైన కృష్ణ జిల్లా నుంచి కూడా బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ ఎలాగూ తోడున్నారు. తోడు వుంటారు. అందువల్ల కాపుల ఓట్లతో సమస్య లేదు. నూరు శాతం ఓట్ల బదిలీ ఆయన సాధించి పెడతారు. పవన్ కు ఇస్తున్న ప్రాధాన్యత చూసి బిసి లు బాధపడకూడదు. అందుకే మంత్రి వర్గంలో వారికి ప్రాధాన్యత ఇచ్చేసారు. ఎనిమిది మంది బిసిలకు మంత్రి పదవులు దక్కాయి. 2019 నుంచి జగన్ జపిస్తున్నది బిసి మంత్రమేగా. అదే చంద్రబాబు కూడా నేర్చుకున్నారు.
కమ్మవారితో సమస్య లేదు ఎందుకంటే అధికారమే వారిది. అందువల్ల మంత్రి మండలిలో వారికి దక్కాల్సిన ప్రాధాన్యత వారికి దక్కింది. నలుగురు కమ్మవారికి మంత్రి పదవులు లభించాయి. కమ్మ- కాపు అన్నదే తెలుగుదేశం తారకమంత్రం కనుక కాపులకు కూడా సమానంగా నాలుగు పదవులు ఇచ్చారు. రెడ్లకు ఎలాగూ అంత వుండదు. ఆ సంగతి రెడ్లకు తెలియంది కాదు. అయినా రాయలసీమ లోనే జగన్ పార్టీని పక్కన పెట్టిన రెడ్లు మంత్రి పదవులు లేకపోతే మాత్రం బాధపడతారా? ఏందీ? అందుకే మూడు మంత్రి పదవులు అంటే అంతగా బాధపడాల్సిన పని లేదు.
ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒకటి, వైశ్యులకు ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. బ్రాహ్మణులకు పోటీనే పెద్దగా లేదు. క్షత్రియులకు అవకాశం కేంధ్రం ఇచ్చింది కనుక ఇక్కడ ఇచ్చినట్లు లేదు.
ఈ కులాల లెక్కలు పక్కన పెడితే వీలయినంత వరకు సీనియర్లను సీన్ లోంచి తగ్గించే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ప్రతి సారీ అవే పేర్లు అనే అపవాదును లేదా రొటీన్ రొడ్డ కొట్టుడు వ్యవహారానికి వీలయినంత వరకు బ్రేక్ వేసారు. కొత్త నెత్తురు ను నింపే ప్రయత్నం చేసారు. బహుశా ఇదంతా లోకేష్ కు కాబోయే టీమ్ అనుకోవాలి.
ఇప్పుడు అధికారం అన్నది కాదు చంద్రబాబు ఆలోచన. 2029 నాటికి దీన్ని మరింత బలంగా నిలబెట్టి, లోకేష్ కు అప్పగించడం అన్నది ఓ తండ్రి కూడా బాధ్యత. అందుకే విస్తృతంగా ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. సరే, సీనియర్లు ఇప్పుడు ఏమీ అలిగేది లేదు. అయినా వందల కొద్దీ నామినేటెడ్ పదవులు వుండనే వున్నాయి. వాటి పంపిణీ ఎలాగూ మొదలవుతుంది.
21 సీట్లు గెలుచుకున్న జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. అవి కూడా వీలయినంత వరకు రెండు మంచి ప్రాధాన్యత వున్న శాఖలే దక్కుతాయి. పవన్ కు, మనోహర్ కు. అందువల్ల మంత్రి వర్గం మీద అసంతృప్తులు పెద్దగా వుండవు. సన్నాయి నొక్కులు అసలే వుండవు.