ప్రపంచంలో ఎక్కడైనా సరే.. నాయకులు ప్రజల శ్రేయస్సును కాంక్షించినట్టుగా వారికి హామీలు ఇస్తారు. వరాలు కురిపిస్తారు. కానీ చంద్రబాబునాయుడు రూటే సెపరేటు. ఆయనకు తన ఓటు బ్యాంకు ముఖ్యం. తన ప్రత్యర్థి మీద బురద చల్లడం ముఖ్యం.. దాని ముందు ఆయనకు ప్రజల ప్రయోజనాలు బలాదూర్.
కాబట్టే ఈ నలభైనాలుగేళ్ల అనుభవజ్ఞుడైన నాయకుడు ఎన్నికల సమయంలో నాణ్యమైన లిక్కర్ మీకు అందుబాటులోకి తెస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోకముందే మాట నిలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు అన్ని కంపెనీలకు బెవరేజస్ కార్పొరేషన్లు ఆర్డర్లు ఇస్తోంది. చంద్రబాబు భావిస్తున్న ‘నాణ్యమైన మద్యం’ ఇక త్వరలోనే దుకాణాల్లోకి వచ్చేస్తుందన్నమాట.
జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే మద్యనిషేధం తీసుకువస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చిన మాట నిజం. అయితే ఆ పని చేయడానికి ఆయన భిన్నమైన మార్గాన్ని అనుసరించారు. ముందుగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. ప్రెవేటు సిండికేట్ ల దందా లేకుండా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలను నిర్వహించే పద్ధతి తీసుకువచ్చారు. అలాగే ప్రజలు కొన్ని బ్రాండ్ లకు వ్యసనంలాగా అలవాటు పడిపోయి ఉంటారనే ఉద్దేశంతో వారి అలవాటును మార్పించేందుకు కొన్ని బ్రాండ్ల అమ్మకాలను ఆపించారు. కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారు.
ఆచరణలో ఆ ప్రయోగం ఎలాగైనా అయి ఉండొచ్చు గానీ.. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడం లాగానే.. వ్యసనపరుల బ్రాండ్లను ఆపేయడం కూడా మంచి ఆలోచనే. పైగా ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్టు షాపు అనే పదమే వినిపించకుండా చేశారు. మద్యనిషేధం అంటే కేవలం అంగళ్లు మూసేయడం మాత్రమే కాదు.. ప్రజల్లో మద్యం అలవాటును మాన్పిండచం అనే సిద్ధాంతానికి తగినట్టుగా అందుకోసం జగన్ కొన్ని చర్యలు తీసుకున్నారు.
కొత్త బ్రాండ్లు వచ్చాయి. ధరలు కూడా పెంచారు. ఆచరణలో ఆ సిద్దాంతం కొంత విజయవంతం అయింది. ప్రజలో వ్యసనం అలవాటు తగ్గుముఖం పడుతోంది. ఈలోగా ఎన్నికలు రావడంతో.. చంద్రబాబునాయుడు ఏ మాత్రం వెరపు కూడా లేకుండా ఎన్నికల ప్రచార సభలలోనే.. తనను గెలిపిస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తానని ప్రకటించి.. భ్రష్టుపట్టారు. నాయకుడు ఎక్కడైనా ఇలాంటి హామీలిస్తారా? అని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
మొత్తానికి ఆయన గెలవడంతో ఇప్పుడు ప్రజలు ఎక్కువగా వ్యసనపడి ఉండే అన్ని రకాల బ్రాండ్లు దుకాణాలకు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరింత విచ్చలవిడి అయ్యే అవకాశం ఉంది.