ఫ‌లించిన జ‌గ‌న్ ప‌రి’శ్ర‌మ’

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌రి'శ్ర‌మ' ఎట్టకేల‌కు ఫ‌లించింది. సుమారు 1300 మందికి ప్ర‌త్య‌క్షంగా, 1150 మందికి ప‌రోక్షంగా ఉపాధినిచ్చే ప‌రిశ్ర‌మ‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఇందుకు తూర్పుగోదావ‌రి జిల్లా బిక్క‌వోలు మండ‌లం బ‌ల‌భ‌ద్ర‌పురం…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌రి'శ్ర‌మ' ఎట్టకేల‌కు ఫ‌లించింది. సుమారు 1300 మందికి ప్ర‌త్య‌క్షంగా, 1150 మందికి ప‌రోక్షంగా ఉపాధినిచ్చే ప‌రిశ్ర‌మ‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఇందుకు తూర్పుగోదావ‌రి జిల్లా బిక్క‌వోలు మండ‌లం బ‌ల‌భ‌ద్ర‌పురం గ్రామం వేదికైంది. ఇక్క‌డ ఆదిత్య బిర్లా గ్రూపు రూ.2700 కోట్ల పెట్టుబడితో కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ఈ ప‌రిశ్ర‌మ‌ను బిర్లా గ్రూప్ చైర్మ‌న్ కుమార మంగ‌ళం బిర్లాతో క‌లిసి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించ‌డం ఏపీలో మంచి ప‌రిణామంగా చెప్పొచ్చు.

పారిశ్రామిక రంగంలో బిర్లా గ్రూప్‌ విశిష్ట‌త ఏంటో అంద‌రికీ తెలుసు. అలాంటి సంస్థ తూర్పుగోదావ‌రి జిల్లాలో గ్రాసిం ఇండ‌స్ట్రీ కోర్ ఆల్క‌లీ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌డం వెనుక ఏపీ స‌ర్కార్ ప‌రిశ్ర‌మ దాగి ఉంది. ప‌రిశ్ర‌మ ప్రారంభం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయ‌న్నారు. ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. మ‌రీ ముఖ్యంగా 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా త‌న పాల‌న‌లో చ‌ట్టం చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.  

ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అవుతుందన్నారు. భయాలకు తావులేకుండా ప్రాజెక్టును నెలకొల్పారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్‌ సంస్థకు ప్రాజెక్ట్‌ అప్పగించిందన్నారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింద‌న్నారు. త‌న‌ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామ‌న్నారు. 

ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్ర‌శంసించారు. పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకు అవకాశం కల్పిస్తామ‌న్నారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో గ్రాసిమ్‌ పరిశ్రమను ఏర్పాటు చేశామని కుమార మంగళం బిర్లా చెప్ప‌డం విశేషం. సీఎం జగన్‌ సహకారం మరవలేనిదన్నారు.  

ఇదిలా వుండ‌గా జ‌గ‌న్ పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప‌, ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర‌త్రా అభివృద్ధి కార్య‌క‌లాపాల‌కు చోటు లేద‌ని విమ‌ర్శించే వాళ్ల నోళ్లు మూయించ‌డానికి ఈ ప‌రిశ్ర‌మ ప్రారంభం ప‌నికొస్తుంది. అయితే ఇలాంటి ప‌రిశ్ర‌మ‌లు మ‌రిన్ని నెల‌కొల్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలాంటి వాటి ద్వారా నిరుద్యోగుల‌కు ఉపాధితో పాటు ఆదాయ వ‌న‌రులు పెరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది.