ముఖ్యమంత్రులు రాజధానిలో ఉంటే కాన్వాయ్ విషయంలో ఎలాంటి సమస్యా ఉండదు. ఎటుతిరిగీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడే వాహనాల సమస్య ఉంటుంది.
ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వస్తే ఆ జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి ప్రయాణానికి అనుకూలమైన వాహనశ్రేణి సమకూర్చాలి ఉంటుంది. అలాంటి సమయంలో గతంలో అయితే పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల వాహనాలు అడిగి తీసుకునేవారు.
మా బెజవాడకు ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే సిరీస్ కంపెనీ అధినేత జి ఎస్ రాజు వాహనాలు వాడేవారు. అలాగే ఇతర జిల్లాలకు, ప్రాంతాలకు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల ప్రముఖుల వాహనాలు తాత్కాలికంగా తీసుకుని ఉపయోగించేవారు.
1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక బస్సు కొనేశారు. ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా ముందురోజే ఆ బస్సు ఆ ప్రాంతానికి చేరుకుని సిద్ధంగా ఉండేది. ముఖ్యమంత్రి ఆ బస్సులోనే ప్రయాణించే వారు. జర్నలిస్టులు కూడా ఆ బస్సులోనే తిరిగే వాళ్ళం.
చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో కాన్వాయ్ వాహనాలు కొన్నారు. వాటిలో జామర్ వాహనం కూడా చేర్చారు. ఇక అప్పటివరకూ వాడుతున్న వాహనాలను పక్కనపెట్టి ఆయన ఎప్పుడైనా జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు వాటిని ఉపయోగించేవారు. ఆయన పర్యటనకు ముందే ఆ పాత వాహనాలు ఆ ప్రాంతానికి చేరుకునేవి.
ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా కాన్వాయ్ కోసం కొత్త వాహనాలు కొనడం మామూలు అయింది. కానీ, ఇప్పుడెందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. అడుక్కోడంలో కూడా రుబాబే అయితే ఎలా?
ఒంగోలులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులపై గట్టి చర్యలు తీసుకోవాలి. రోడ్డుపై వదిలేసిన ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పడం ఒక్కటే కాదు, అధికారులే దగ్గరుండి ఆ కుటుంబాన్ని తిరుపతి తీసుకెళ్ళి దర్శనం చేయించింది తిరిగి ఇంటిదగ్గర దింపేయాలి.
తప్పు దిద్దుకోవడం అంటే అదే… మొక్కుబడిగా ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశాం అంటే సరిపోదు.
Gopi Dora