టీడీపీ యువకిషోరం నారా లోకేశ్ ఏ కేటగిరీలోకి వస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలే లోకేశ్ విషయమై చర్చకు దారి తీశాయి. పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సీనియారిటీ ఉన్నా, ఓటు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభమని ప్రశ్నించారు.
ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా తమకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరితే, టీడీపీ ప్రతిపక్షంలోనే ఉంటుందన్నారు. 40 శాతం యువతకు సీట్లు ఇవ్వాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. కొందరు సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చారని, ఇంకొందరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.
సీనియర్ నేతల వారసులే కాదు.. తటస్థ యువకులనూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇంతకూ తనయుడు లోకేశ్ గురించి చంద్రబాబు అభిప్రాయం ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
లోకేశ్‌ను సీనియర్‌గా పరిగణిస్తున్నారా? లేక యువకుడిగా భావిస్తున్నారా? అసలు లోకేశ్‌ను ఏ విధంగా పరిగణిస్తున్నారో చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లోకేశ్ వల్ల పది ఓట్లు వస్తాయా లేక పోతాయా? అని ఎప్పుడైనా ఆలోచించారా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
చంద్రబాబు వయసై పోయిందని, సీఎం అభ్యర్థి లోకేశ్ అని ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తూ, టీడీపీకి నష్టం కలిగించే కుట్ర జరుగుతోందని ఎల్లో పత్రిక ఆ మధ్య ఎందుకు రాసిందో అర్థమవుతోందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
లోకేశ్ వల్ల ప్రయోజనం లేదని టికెట్ నిరాకరిస్తారా లేక తనయుడికి ప్రత్యేక మినహాయింపుతో కేటాయిస్తారా? అని సెటైర్స్ విసురుతున్నారు. అందరికీ ఒక నీతి, తనయుడికి మాత్రం మరొకటా అనే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్‌ను వారసుడిగా ముందుకు తేవడం కంటే పార్టీకి నష్టం కలిగించే అంశం ఏదైనా వుందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.