తాతినేని రామారావు చనిపోయారు. చాలా సినిమాలు డైరెక్ట్ చేసినా ఆయన బాగా గుర్తుండిపోయేది యమగోలతోనే.
1977లో అడవిరాముడు సూపర్‌హిట్ తర్వాత యమగోల ప్రచారం మొదలైంది. షూటింగ్‌లో నవ్వుతూనే ఉన్నానని NTR స్టేట్‌మెంట్ సినిమా పత్రికల్లో ప్రముఖంగా రావడంతో క్రేజ్ పెరిగింది. అడవిరాముడులో జయప్రద టాప్‌స్టార్‌గా మారింది. కుర్రాళ్లంతా ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని పాడుకుంటున్న రోజులు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అక్టోబర్‌లో రానే వచ్చింది. అనంతపురం రఘువీరా టాకీస్‌లో వేశారు. ఆ రోజుల్లో అర్ధరాత్రి షోలు లేవు. ఉదయం 9 గంటలకి మొదటి ఆట. థియేటర్ దగ్గర ఒకటే జనం. ఎన్టీఆర్ అభిమానులు కటౌట్‌కి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. కొందరు టెంకాయలు కొట్టి దిష్టి కూడా తీశారు. నేను చిన్నవాన్ని. క్యూ చూసి భయమేసింది. రూ.1.50 పైసల కౌంటర్ దగ్గర నిలబడ్డాను. తొక్కిసలాటలో ఉక్కిరిబిక్కిరై టికెట్ సంపాదించాను.
థియేటర్‌లో జనాల అరుపులు. అప్పట్లో బిల్డప్ సీన్స్ లేవు. రావుగోపాలరావుతో సినిమా ప్రారంభమవుతుంది. NTR సాధారణంగా ఎంట్రీ ఇస్తారు. అభిమానులు రెచ్చిపోయారు. పువ్వులు, డబ్బులు విసిరారు. కొంత మంది బెలూన్లు గాల్లోకి వదిలారు. కాసేపటికే ఎన్టీఆర్‌తో పాటు ఆయన డూప్ కర్ర తిప్పుతూ ఎద్దుల బండిని అటూఇటూ తిప్పి ఫైటింగ్ చేస్తే జనం పిచ్చి పీక్స్‌కి వెళ్లింది. నిజ జీవితంలో ఎన్టీఆర్‌కి జగ్గారావు పర్సనల్ సెక్యూరిటీ. అందుకే ఎన్టీఆర్ ప్రతి సినిమాలో జగ్గారావు వుంటాడు. ఎన్టీఆర్ కొడుతూ వుంటే అంత లావు జగ్గారావు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా వుంటాడు. స్వామి ధర్మం.
సమయానికి దేవుడిలా వచ్చి ఎన్టీఆర్ జయప్రదని కాపాడితే, మీ రుణం తీర్చుకోలేమని జయప్రద తల్లి అంటుంది. వెంటనే ఎన్టీఆర్ ఓలమ్మీ తిక్క రేగిందా అని పువ్వులా ఉన్న జయప్రదని గిరగిరా తిప్పుతూ వుంటే జనానికి ఏమీ అర్థం కాలేదు. ఎన్టీఆర్ ఆ రేంజ్‌లో ఎగరడం, స్టెప్పులేయడం కొత్త. పైగా గాల్లోకి ఎగిరి అరుస్తాడు కూడా.
ఇంటర్వెల్‌కి అందరికీ అర్థమైపోయింది సినిమా సూపర్‌హిట్ అని. కొందరు రావుగోపాలరావుని, సత్యనారాయణని అనుకరిస్తూ మిమిక్రీ చేశారు. తిక్కరేగిందా అని డ్యాన్స్ చేశారు. తర్వాతి షో కోసం క్యూలో నిలబడిన వాళ్లని గేటు కంతలో నుంచి పలకరిస్తూ హిట్ సమాచారం చేరవేశారు.
సెకెండాఫ్‌లో అల్లు రామలింగయ్య కామెడీ, జయమాలిన గుడివాడ డ్యాన్స్‌తో జనాలు ఈలలు, కేకలు. తర్వాత వీధుల్లో కూల్‌డ్రింక్ షాపుల్లో యమగోల పాటలే. యమగోల ఒక బెంగాలీ సినిమాకి అనుకరణ. గతంలో వచ్చిన దేవాంతకుడు కూడా ఇలాంటి కథే.
ఈ సినిమా సక్సెస్‌కి ఎన్నో కలిసొచ్చాయి. డీవీ నరసరాజు డైలాగ్‌లు ప్రాణం పోశాయి. పాటలు హిట్. జయప్రద గ్లామర్. ఎన్టీఆర్ ఇమేజ్‌తో పాటు రావుగోపాలరావు విలనీ, సత్యనారాయణ యముడిగా, అల్లు చిత్రగుప్తుడిగా నటన అద్భుతం. డైలాగుల రికార్డులు కూడా జనం తెగ విన్నారు. రఘువీరా టాకీస్‌లో ఈ సినిమా వంద రోజులు ఆడినట్టు గుర్తు.
తర్వాత ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అందులో యముడికి మొగుడు, యమలీల సూపర్ డూపర్ హిట్స్.
అన్నిటికంటే ముఖ్య విషయం ఏమంటే 77లో ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలు జరిగితే ఇందిరమ్మ ఓడిపోయి జనతా వచ్చింది. యమగోలలోని పొలిటికల్ డైలాగ్‌లు ముఖ్యంగా ఎన్టీఆర్, సత్యనారాయణ మధ్య నడిచేవి అప్పటి రాజకీయాలకి కనెక్ట్ అయ్యాయి. దాంతో జనం బాగా ఎంజాయ్ చేశారు.
జీఆర్ మహర్షి