ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌పై విరుచుకుపడడంలో మాజీ మంత్రి కొడాలి నానిది ప్రత్యేక శైలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు, లోకేశ్ విమర్శలు గుప్పిస్తే, వెంటనే మీడియా ముందుకు కొడాలి నాని వచ్చేవారు. ఇప్పుడాయన మాజీ మంత్రి అయ్యారు. అయితే ఆయన్ను గుర్తు తెచ్చేలా పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబుపై ఒంటికాలిపై లేచారు.
ఒంగోలులో వినుకొండకు చెందిన శ్రీనివాస్ కుటుంబానికి ఆర్టీఏ అధికారులు ఇబ్బందులు తేవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆర్టీఏ అధికారితో పాటు హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు చంద్రబాబు తన మార్క్ ఆరోపణలు గుప్పించారు.
ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లోకి వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా అని చంద్రబాబు ఘాటుగా ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని దుస్థితి రాష్ట్రానికి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మీడియాతో మాట్లాడుతూ అమ్మాయి కావాలని కోరుకుంటే మహిళలను ఎత్తుకు పోతారా అని చంద్రబాబు ఎలా మాట్లాడ్తారని నిలదీశారు. ఇలాంటి మాటలు మాట్లాడే చంద్రబాబు మనిషేనా అని ఆయన ప్రశ్నిం చారు. చంద్రబాబు ఉన్మాదిలా బరి తెగించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి హితవు చెప్పారు. గతంలో చంద్రబాబుకు ఈ స్థాయిలో క్లాస్ పీకడం ఒక్క కొడాలి నానికే సాధ్యమైంది. కొడాలి నాని దూకుడును కొంత మేరకు మంత్రి అమర్నాథ్ ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.