కొత్త మంత్రి..కొత్త వాగ్దానం.. ఆ ఇళ్లకు ఎప్పుడు మోక్షం?

టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయి, అయినా మాపై కక్షతో ప్రజలకు ఇవ్వడంలేదనేది టీడీపీ ఆరోపణ. మూడేళ్లుగా ఈ ఆరోపణ చేస్తున్నా ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఓసారి రంగులు మార్చింది, ఇంకోసారి వాటిని కొవిడ్ కేర్ సెంటర్లుగా…

టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయి, అయినా మాపై కక్షతో ప్రజలకు ఇవ్వడంలేదనేది టీడీపీ ఆరోపణ. మూడేళ్లుగా ఈ ఆరోపణ చేస్తున్నా ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఓసారి రంగులు మార్చింది, ఇంకోసారి వాటిని కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది. ఇటీవల పత్రాలు చేతికందించింది. కానీ మెజార్టీ ప్రాంతాల్లో ఇంకా గృహప్రవేశాలు జరగలేదు. 

ఇప్పుడు మంత్రి మారారు. కొత్తగా మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ లో 1.34 లక్షల మందికి టిడ్కో ఇళ్లు అప్పగిస్తామంటున్నారు. ఈ డెడ్ లైన్ అయినా నిజమవుతుందా..?

గతంలో మున్సిపల్ శాఖ ను పర్యవేక్షించిన బొత్స సత్యనారాయణ టిడ్కో ఇళ్లపై పలు డెడ్ లైన్లు ప్రకటించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు కొత్తగా ఆ శాఖకు మంత్రి మారారు. ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తాజా డెడ్ లైన్ ప్రకటించారు. 

మే నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో టిడ్కో ఇళ్ల కేటాయింపు మొదలు పెడతామన్నారు సురేష్. ఆ తర్వాత జూన్ కల్లా 1.34 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. డిసెంబర్ నెలాఖరునాటికి 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ధీమాగా చెబుతున్నారు.

అదనపు భారం ఎంతంటే..?

2019 ఎన్నికలకు వెళ్లే సమయంలో చంద్రబాబు ఆడిన డ్రామాల్లో టిడ్కో ఇళ్ల వ్యవహారం ఒకటి. నిర్మాణాలు పూర్తి కాకముందే, సౌకర్యాలు కల్పించకముందే గృహప్రవేశాలు చేసి మరీ చంద్రబాబు పెద్ద డ్రామా నడిపారు. ఆ డ్రామా ఖరీదు 3082 కోట్ల రూపాయలు. ఆ మొత్తం అప్పుగా తేల్చి వైసీపీ ప్రభుత్వంపై ఆ భారాన్ని నెట్టేశారు బాబు. ఆ అప్పులు తీరుస్తూ కొత్తగా 4287 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని భరిస్తూ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.

ఇక రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తామే భరిస్తామంటూ పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ఇలా మొత్తం వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 10వేల కోట్ల రూపాయల భారాన్ని భరిస్తోంది. అవి అప్పగిస్తే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంటామంటోంది టీడీపీ. ఈ గొడవ వల్లే ఇన్నాళ్లూ కేటాయింపు లేటయినా.. ఇప్పుడవి పూర్తి చేసి ప్రజలకు అప్పగిస్తామంటున్నారు కొత్త మంత్రి. ఈసారి ఏమవుతుందో చూడాలి.