వినడానికి ఆశ్చర్యంగా వుంటుంది కానీ, రావు గోపాలరావు లాంటి గంభీరమైన కంఠం పనికి రాదని అదేదో పాత సినిమాలో డబ్బింగ్ చెప్పించారు. మోసగాళ్లకు మోసగాడులో తన్నులు తినే రౌడీ పాత్ర. ముత్యాల ముగ్గుతో దశ మారింది. యమగోలతో మొత్తం మారింది. మళ్లీ వెనక్కి చూడలేదు. మామూలుగా కళారంగంలో తండ్రికి తగ్గ కుమారుడే కష్టం, తండ్రికి మించిన వాడు మరీ కష్టం. అలాంటి నటుడే గోపాలరావుగారి అబ్బాయి రావు రమేష్.
కామెడీగా ok, విలన్‌గా ok, హీరోయిన్ తండ్రిగా అంతకంటే ok. ఏ పాత్రలోనైనా ఇమిడిపోతాడు. తండ్రికి వారసుడే కానీ, ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీకి వచ్చినవాడు కాదు. కష్టాన్ని నమ్మిన వాడు. మగధీరలో కనిపించింది కాసేపే అయినా గుర్తుండి పోతాడు. తర్వాత ఆయన్ని అందరూ గుర్తించక తప్పలేదు. డైలాగ్‌లు పలికే పద్ధతి, విరిచే తీరు విలక్షణంగా వుంటుంది. సాధారణమైన డైలాగ్ కూడా రమేష్ నోట్లో పడితే పాపులర్ అవుతుంది.
“ఎవరికైనా చూపించండ్రా , వదిలేయకండి అలా” ఈ డైలాగ్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. దీన్ని వేరే నటుడు పలికితే ఇంతలా క్లిక్ అయ్యేది కాదేమో. అ.. ఆలో క్లైమాక్స్ సీన్‌లో ఆయన నటన మామూలుగా ఉండదు.
“శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్లు కూతుళ్లు మారువేషాలు వేసుకుని మన చుట్టూనే తిరుగుతూ వుంటారు” – ఈ డైలాగ్ రావు రమేష్ నుంచే వినాలి.
నిజానికి ఆయన మంచి ఫొటోగ్రాఫర్ కావాలనుకున్నారు. కాలేదు. ఒకవేళ అయివుంటే గొప్ప ఫొటోగ్రాఫరే అయి వుండేవాడు. నటన అంటే పెద్ద ఆసక్తి లేదు. సీరియల్స్‌లో నటిస్తూ ఇదంతా తన వల్ల కాదనుకున్నాడు. ఇంత వాడుగా కనిపిస్తున్నాడు.
ఆసక్తి లేని నటనలోనే ఇంతుంటే , ఫొటోగ్రఫికి వెళితే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకునే వాడేమో.
జీఆర్ మహర్షి