సుదీర్ఘత విసిగిస్తోంది. క్షణికం లోబరచుకుంటోంది. గాలి బుడగ దేహాన్ని గుర్తు చేస్తూ వుంటుంది. అంతా బావుందనిపిస్తుంది. కానీ ఏమీ బాలేదు. మట్టిలో మొలకెత్తుతున్న విత్తనాలు నా పూర్వీకులు కావచ్చు. అందరూ కాలంలో కలిసిపోయారు. కొండలు పిండి చేసిన వాళ్లు, క్రూర మృగాలతో పోరాడిన వాళ్లు, జీవితానికి తలవంచిన వాళ్లు. ఎదిరించిన వాళ్లు ఎవరూ లేరు.
జీవితం మోసకారి, మృత్యువు ఆఖరి స్నేహితుడు. ఎండలు పోయి వానలు, చినుకులు మాయమై మంచు. ఏదీ వుండదు, ఆగదు. వినే వాడికి జలపాతం ఒక సంగీతం. వినలేని వాడికి రోద, రోదన.
ఒక పశువు మరణించి వాయిద్యం అవుతుంది. మనుషులంతా మొక్కలవుతారు. కొన్ని పిచ్చి మొక్కలు, పండ్ల మొక్కలు. ఎక్కడి నుంచి వచ్చామో, అక్కడికే వెళ్తాం. మట్టి లేదా బూడిద, సంస్థానాలు, సింహాసనాలు, ఆధిపత్యాలు, అహాలు అన్నీ నేల మీద విడిచి, ఏదో చెట్టు త్యాగం చేసిన కాసిన కర్ర పేళ్లు పాడెగా చేసుకుని ధూళిగా, పొగగా ప్రయాణం.
మర్మం అందరికీ తెలుసు. కానీ మాయ ఎవరికీ తెలియదు. భ్రాంతిని నమ్మిన వాడు కాంతిని చూడలేడు. చీకటి రహస్యం అంధులకే తెలుసు. దృష్టి దోషం ఉన్నవాడికి రంగులు అర్థం కావు. ఇంద్రధనస్సుకి ఊయల ఊగే వాడు స్వాప్నికుడు. ప్రపంచపు వింతలన్నీ మనిషి కలలే.
విషాన్ని, అమృతాన్ని ఒక గాజు పాత్ర సమానంగా చూస్తుంది. అద్భుతాలన్నీ అనుభూతులే, నిజంగా లేవు. వాస్తవాలన్నీ విస్ఫోటనాలు, విధ్వంసాలే. ప్రతి మనిషీ ఒక అగ్నిపర్వతాన్ని మోస్తున్న కాలం. లావాని చిరునవ్వుగా చిత్రీకరించుకుని నటిస్తున్న ఉత్తమ నటులు. ఒక్కోడు ఒక్కో ఆస్కార్.
పోర్షన్ మరిచిపోతారు. ప్రాంప్టర్ అదృశ్యం. కానీ నాటకం ఆగదు. జీవితం అనే విమానాశ్రయంలో ఎడ్ల బండ్లు తిరుగుతూ వుంటాయి. కాసేపట్లో ఎగురుతామనుకుంటాం. రెక్కలుండవు. ఎగిరే వాడి కాళ్లకు బండరాళ్లు కట్టడం లోక నీతి. తాబేలుని చూస్తే కుందేలికి ఎగతాళి. కుందేల్ని చూస్తే జింకకు చిన్నచూపు. అందరికీ అన్నీ రావు. ఏనుగుకి రెక్కలుంటే ఎపుడో అంతరించేది.
సాలె పురుగు గూడు అల్లితే బతుకుతెరువు. నాయకులు వల విసిరితే బతుకు తెలివి. ఆశ, ఆకర్షణ, తప్పించుకోలేని సూదంటురాళ్లు.
ఎక్కాల్సిన స్టేషన్లో ఎక్కవు. దిగే చోట దిగవు. ఎందుకో, ఎక్కడికో తెలియదు. తిరుగుతూ వుంటేనే జీవితం అని నమ్మే గానుగెద్దులు.
ఎవడి హాస్యాన్ని, విషాదాన్ని వాడే సృష్టించుకుంటాడు. విదూషకులు, విలన్లు అక్కర్లేదు. పిచ్చివాళ్లు, పసివాళ్లు మాత్రమే హాయిగా నవ్వగలరు.
ఆట నిరంతరం. పరదాలు ఎత్తేవాడు, దించేవాడు లేడు. తెరచాటు ఏమీ లేదు. అన్నీ అందరికీ తెలుసు. తెలియనట్టు నిమ్మళం. చదరంగంలో అటూఇటూ నువ్వే. ఎత్తులు అనవసరం. గెలుపు, ఓటమి రెండూ నీ చేతుల్లోనే. సైన్యం అక్కర్లేని యుద్ధం. యుద్ధమే తెలియని సైన్యం. మనకు మనమే పద్మ వ్యూహాలం. ఎంట్రీ , ఎగ్జిట్ రెండూ కనపడవు. నరకం పేరు స్వర్గం, స్వర్గం పేరు నరకం. భటుల యూనిఫాం మారింది. ఇంద్రుడు, యముడు పదవులు మారారు. భూమి తిరుగుతూ వుంది. కాలం ఒక కాలకూట సర్పం.
జీఆర్ మహర్షి