వైసీపీపై టీడీపీ వేట మొదలు పెట్టింది. కక్ష, ప్రతీకార చర్యలు తీసుకునేందుకు టీడీపీ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రులు, ఇతర వైసీపీ నాయకుల లొసుగులను టీడీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో టీడీపీ మొదటి టార్గెట్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణే అని స్పష్టమైంది.
విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ తీవ్ర అవినీతికి పాల్పడినట్టు టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఇందుకు సంబంధించి ఆధారాలున్నాయని, చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఏసీబీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఏసీబీకి ఫిర్యాదు అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు.
అవినీతికి పాల్పడిన మంత్రులందరూ మూల్యం చెల్లించాల్సిందే అని వర్ల రామయ్య హెచ్చరించారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బొత్స, ఆయన పేషీలోని సిబ్బంది వసూళ్లు చేశారని ఆయన ఆరోపించారు. ఇలా మొత్తం రూ.65 కోట్లు వసూళ్లు చేసినట్టు ఆయన అన్నారు. బొత్స హయాంలో జరిగినంత మోసం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. అంతా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూచుంటారని ఆయన తేల్చి చెప్పారు.
జగన్ కేబినెట్లో బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. బొత్స కుటుంబ సభ్యులంతా వైసీపీలో చురుగ్గా పని చేస్తున్నారు. బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. బొత్సను టార్గెట్ చేయడం ద్వారా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను మరీ ముఖ్యంగా టీడీపీ చెప్పకనే చెబుతోంది.