వైసీపీ కీలక నేత, ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం అనంతరం ఆయన రాజకీయాల నుంచి వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించడం గమనార్హం. ఈ సందర్భంగా ఎక్స్, ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఏంటంటే…
“జాగ్రత్తగా ఆలోచించి, తర్కించుకుని రాజకీయాల నుంచి వైదొలగాలని, నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజానీకానికి సేవ చేయ గలగడం నాకు లభించిన అపూర్వమైన గౌరవం. విజయవాడ ప్రజలు తమ నిర్ణయాత్మక సామర్థ్యంతో నాకు ఎంతో ప్రేరణ ఇచ్చి నాకు తమ మద్దతు అందించినందుకు వారికి నా ధన్యవాదాలు.
రాజకీయ రంగం నుంచి నేను వైదొలగుతున్నప్పటికీ విజయవాడ పట్ల నా నిబద్ధత బలంగా కొనసాగుతుంది. విజయవాడ పరిపుష్టికి చేతనైన మేరకు నా చేయూత కొనసాగుతుంది. నా రాజకీయ జీవితంలో చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మరో అధ్యాయానికి అడుగు వేస్తున్న నాకు విలువైన జ్ఞాపకాలు , అనుభవాలు నాతో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధి పథంలో నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు నా శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేశినేని నాని… ఎన్నికల్లో తన తమ్ముడు చిన్ని చేతిలో ఓడిపోయారు. ముఖ్యంగా లోకేశ్‌తో అభిప్రాయ బేధాలొచ్చి, టీడీపీ నుంచి ఆయన వైసీపీలో చేరారు. వచ్చీ రాగానే ఆయనకు విజయవాడ పార్లమెంట్ టికెట్‌ను జగన్ ఇచ్చారు. అప్పటి నుంచి విజయవాడ పార్లమెంట్ పరిధిలో నాని విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ కూటమి సునామీలో ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది.