పవన్ మోజు: పదవిలో ఆ పదం ఉండాల్సిందేనా?

పవన్ కల్యాణ్ అభిమానులకు ఆయనంటే వెర్రి అభిమానం. తెలుగుదేశంతో పొత్తులు కుదిరేదాకా ఆయన బహిరంగ వేదికల మీద కనిపించిన ప్రతిసారీ.. ‘సీఎం సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసేవారు. పవన్ కల్యాణ్ కూడా…

పవన్ కల్యాణ్ అభిమానులకు ఆయనంటే వెర్రి అభిమానం. తెలుగుదేశంతో పొత్తులు కుదిరేదాకా ఆయన బహిరంగ వేదికల మీద కనిపించిన ప్రతిసారీ.. ‘సీఎం సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసేవారు. పవన్ కల్యాణ్ కూడా ‘సీఎం’ అనే ఆ పదాన్ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నారు. నాకు కూడా కావాలనే ఉంది.. కానీ అందుకు తగిన బలాన్ని మీరు ఇవ్వాలి.. అంటూ ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు.

తెలుగుదేశంతో పొత్తుల్లోకి వెళ్లిన తర్వాత.. ఈ నినాదాలు కొంత తగ్గాయి. ఆ కూటమి గెలిచినా సరే.. సీఎం పోస్టు తమకు దక్కేది కాదనే క్లారిటీ అందరికీ ఉంది గనుక! ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న తరుణంలో కేబినెట్ లోకి తన పార్టీ సహచరుల పేర్లను సిఫారసు చేస్తున్న సమయంలో.. పవన్ కల్యాణ్.. తాను కూడా ప్రభుత్వంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

ప్రధాని పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమం వేదిక సమీపంలో ఇండియాటుడే రిపోర్టరుతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఈ మేరకు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రి పదవిని తాను ఆశిస్తున్నట్టుగా జనసేన అధినేత చెప్పినట్టు ఆ చానెల్ వెల్లడించింది.

తాను తీసుకునే పదవిలో ‘సీఎం’ అనే పదం ఉంటేనే జనసేనాని ఆ మజాను ఫీల్ అయ్యేలా ఉన్నారు. పవన్ కల్యాణ్ లో నిజానికి ఇప్పటికీ చాలా సందిగ్ధత ఉంది. సందిగ్దత ఆయన వ్యక్తిత్వంలోనే ఉంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. అమిత్ షా సూచించినట్టు రాజ్యసభ ఎంపీ పదవి తీసుకుని కేంద్రమంత్రి అయిపోవాలా అనే గుంజాటనలో పడ్డారు. ఎమ్మెల్యే అనే సంగతిని కూడా చివరిదాకా తేల్చకుండా ఆయన నానబెట్టారు.

ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారు. మంత్రి పదవిని పవన్ తీసుకుంటారా లేదా అనే క్లారిటీ లేదు. ఆయన కేబినెట్లో చేరకుండా.. పార్టీ ఎమ్మెల్యేలకు పదవులు ఇప్పిస్తారని ప్రచారం జరిగింది. తీరా ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబోతున్నట్టుగా చెబుతున్నారు.