కేంద్రంలో ఎన్డీఏ సర్కారు స్పష్టమైన మెజారిటీతోనే కొలువుతీరింది. అంతమాత్రాన భారతీయ జనతా పార్టీ ఎవరికీ భయపడవలసిన అవసరం లేకుండా, ఎవరి మాటకు విలువ ఇవ్వవలసిన అవసరం లేకుండా తమ ఇష్టారాజ్యంగా చెలరేగడానికి.. ఇదివరకు రెండు దఫాలలాగే ఈసారి కూడా కుదురుతుందా అంటే సందేహమే!
ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ ను దాటినంత బలం దక్కలేదు. అనివార్యంగా కూటమి భాగస్వామి పార్టీల బలం మీద ఆధార పడవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భాగస్వాముల్లో బలమైన పక్షాలు కేంద్రం ముందు ఎలాంటి డిమాండ్లు పెడతాయి.. వాటికి కేంద్రం ఎలా స్పందిస్తుంది.. అనేది కీలకమైన చర్చనీయాంశంగా ఉంది!
బీహార్ ఇప్పటికే తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ను వినిపించింది. గతంలో ఎలాంటి ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాట దీక్షలు కూడా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ మాట ప్రస్తావించడం లేదు. బీహార్ కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా దక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కకపోతే గనుక అది నూటికి వెయ్యి శాతం చంద్రబాబు నాయుడు చేతగానితనం అవుతుందే తప్ప మరొకటి కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్డీఏ భాగస్వామి పార్టీల్లో నితీష్ సారధ్యంలోని జెడియు, చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం మాత్రమే బలమైనవి. తెలుగుదేశానికి 16 మంది ఎంపీలు ఉండగా, జేడీయుకు 12 మంది ఎంపీలు ఉన్నారు. నితీష్ కుమార్ ఎప్పుడు ఎటు మొగ్గుతూ ఉంటారో అంచనా వేసి చెప్పడం చాలా కష్టం. ఆయన ఎన్నిసార్లు కూటములు ఫిరాయించినా అందుకు ఏదో ఒక సమర్ధించుకునే మాట చెబుతూనే ఉంటారు.
మరి ప్రత్యేక హోదా విషయంలో నితీష్ గట్టిగా పట్టుబడితే గనుక ఎన్ డి ఏ సర్కారు వారికి ఇవ్వవలసి వస్తుంది. చంద్రబాబు నాయుడు- నితీష్ కుమార్ కంటే కొంత మెరుగు! అంత త్వరగా హఠాత్తుగా ఆయన కూటమిలను ఫిరాయించకపోవచ్చు! అయితే నితీష్ కంటే ఎక్కువ బలం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అడిగితే రెండు రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సిన ఆగత్యం కేంద్రానికి ఏర్పడుతుంది.
బీహార్ హోదాను సాధించుకుని ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోతే అది పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యం అవుతుంది. బీహార్ ప్రస్తుతానికి హోదా డిమాండ్ ను కేంద్రముందు పెట్టడం మాత్రమే కాదు ఇంకా అనేక విధాలుగా పావులు కలుపుతోంది.
నేషనల్ మీడియాలో బీహార్ కు ప్రత్యేక హోదా అనేది ఎంత ధర్మ సమ్మతమో వివరించే ప్రత్యేక కథనాలు కూడా వస్తున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడు కూడా నేషనల్ మీడియాను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన ఆ మీడియాను తన సొంత డబ్బా కోసం వాడుకుంటూ ఉంటారు.
అలా కాకుండా చంద్రబాబు నాయుడు నేషనల్ మీడియాను ప్రభావితం చేసి, బీహార్ కు కేంద్రం హోదా ఇవ్వదలుచుకుంటే గనుక అంతకంటే ముందు, అంతకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవ్వాలనే వాదనను మీడియా వైపు నుంచి బలంగా వినిపించ గలిగితే గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ సాధ్యం కాదు అనుకున్న స్వప్నం సాకారం అవుతుంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తే చంద్రబాబు నాయుడును ఈ రాష్ట్ర ప్రజలు హీరోలాగా చూస్తారు. ఆ విషయం ఆయన దృష్టిలో పెట్టుకుంటే మంచిది.