ఊపిరి ఉన్నంత వ‌ర‌కూ జ‌గ‌న్‌తోనే!

వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో, ఆ పార్టీ త‌ర‌పున గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ప్ర‌తిప‌క్షంలో కూచోడానికి ఎవ‌రికీ ఓర్పు లేదు.…

వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో, ఆ పార్టీ త‌ర‌పున గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీల‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ప్ర‌తిప‌క్షంలో కూచోడానికి ఎవ‌రికీ ఓర్పు లేదు. రాజ‌కీయాల్లో కొన‌సాగాలంటే అధికార పార్టీలో ఉండాల‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌లో గెలుపొందిన ఎమ్మెల్యే అభ్య‌ర్థులు పార్టీ మారుతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

ఉత్త‌రాంధ్ర‌లో పాడేరు నుంచి మ‌త్స్య‌రాజు విశ్వేశ్వ‌ర‌రాజు, అర‌కులో మ‌త్స్య‌లింగం వైసీపీ త‌ర‌పున గెలుపొందారు. మిగిలిన అన్ని అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులే గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీ మార్పుపై పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రాజు స్పందించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు.

తాను పార్టీ మారుతున్న‌ట్టు దుష్ప్ర‌చారం సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీని వీడేది లేద‌న్నారు. ఒక‌వేళ వైసీపీని వీడితే పుట్ట‌గ‌తులుండ‌వ‌ని ఆయ‌న అన్నారు. త‌న అభివృద్ధి కోసం జ‌గ‌న్ ఎంతో తోడ్పాటు అందించార‌ని ఆయ‌న అన్నారు. ఊపిరి ఉన్నంత వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్‌తోనే రాజ‌కీయంగా ప్ర‌యాణం సాగిస్తాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ ప్ర‌జాప్రతినిధుల పార్టీ మార్పుపై సాగుతున్న ప్ర‌చారానికి ప్ర‌స్తుతానికి ఫుల్‌స్టాప్ ప‌డింది.

అయితే రాజ‌కీయాల్లో ఇలాంటి మాట‌లు ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే. ప‌రిస్థితులు వారిని మారుస్తుంటాయి. ఇందుకు ఎవ‌రూ అతీతులు కారు. ప్ర‌స్తుతానికైతే పార్టీ మార‌ర‌ని వైసీపీ ఊపిరి పీల్చుకోవ‌చ్చు. భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో చెప్ప‌డానికి ప‌రిస్థితులు వాళ్ల చేత‌ల్లో కూడా ఏమీ వుండ‌వ‌నేది నిజం.