జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తాను అనుకున్నట్టు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. లోకేశ్ కూడా కేబినెట్‌లో వుంటారని స్పష్టమైంది. దీంతో పవన్‌కల్యాణ్ పాత్ర ఏంటి? అనే చర్చకు తెరలేచింది.
ఈ క్రమంలో తాను ఉప ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్టు పవన్‌కల్యాణ్ తన మనసులో మాట బయటపెట్టారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తన పాత్రపై ఆయన నర్మగర్భ వ్యాఖ్య చేయడం విశేషం. అయితే పవన్‌కల్యాణ్ ఆశ ఎలా ఉన్నా, దాన్ని నెరవేర్చాల్సింది చంద్రబాబే. దీంతో పవన్‌కల్యాణ్ పదవిపై చంద్రబాబు మనసులో ఏముందో అనే చర్చకు తెరలేచింది. లోకేశ్‌ను వారసుడిగా తీసుకొచ్చేందుకు ఇదే సరైన సమయమని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ సమయంలో పవన్‌కల్యాణ్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారనే విషయమై చర్చ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌తో పాటు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సి వుంటుంది. టీడీపీతో సమానమైన అధికారాన్ని జనసేన కోరుకుంటోంది. ఎందుకంటే కూటమి ఏర్పాటు, అలాగే అధికారంలోకి రావడానికి పవనే కారణమని ప్రతి ఒక్కరూ అంటున్న మాట. దీంతో ప్రభుత్వంలో తమది కీలక పాత్ర ఉండాలని జనసేన భావన.
ఇది ఏ మేరకు సాధ్యమనేదే ప్రశ్న. చంద్రబాబునాయుడు తనకు కాకుండా, ఇతరులకు సంపూర్ణ అధికారులు ఇవ్వరనే చర్చకు తెరలేచింది. ఒకవేళ ఇస్తే, దుర్వినియోగం చేస్తారనే భయం ఆయనలో వుంది. ఇవన్నీ పక్కన పెడితే పవన్‌కు డిప్యూటీ సీఎం, అలాగే హోంశాఖ మంత్రి పదవి ఇస్తారని జనసేన నాయకులు అంచనా కడుతున్నారు.