కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం. కక్షపూరిత దాడులు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఎన్నికల అనంతరం ఇలాంటి దాడుల్ని చూసి వుండమనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై వైసీపీ నేతలు కేసులు పెట్టించారు. వేధించారు. చాలా చోట్ల వైసీపీ ప్రభుత్వం నుంచి టీడీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు అధికారంలోకి రావడంతో టీడీపీ, అలాగే కొన్ని చోట్ల జనసేన నాయకులు తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులకు తెగబడ్డారు. దాడులపై వైసీపీ ప్రేక్షక పాత్ర పోషించడం మినహా, ఏమీ చేయడం లేదు. పోలీసుల ఎదుటే టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు దిగుతున్నారు. అడ్డుకునే పరిస్థితే లేదు. అడ్డుకుంటే తమపై బదిలీ వేటు వేస్తారనే భయం పోలీస్ అధికారులను వెంటాడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా దాడులపై ఫిర్యాదు చేసినా స్వీకరించడానికి పోలీసులు సిద్ధంగా లేరు. కొన్నాళ్లు ఊళ్లు వదిలి వెళ్లాలంటూ ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన వారికి పోలీస్ అధికారులు నచ్చచెబుతున్నారని తెలిసింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఉన్న వారిని వదిలి వెళ్లాలని చెబితే ఎలా అని బాధితులు వాపోతున్నారు. తామేమీ చేయలేమని, కూటమి ప్రభుత్వం ఏర్పాటై, కొంత కాలం జరిగిన తర్వాత వస్తే… మీకే మంచిదని పోలీస్ అధికారులు హితవు చెబుతున్నారని సమాచారం.
దీంతో ఏం చేయాలో వైసీపీ కేడర్‌కు దిక్కుతోచడం లేదు. గతంలో వైసీపీ చేసిన పాపాలు కొన్ని చోట్ల వారిని వెంటాడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం… అపరిమితమైన అధికారం వచ్చిందని, వైసీపీని నామరూపాల్లేకుండా చేయడానికి ఇదే సరైన సమయం అనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 12న పూర్తిస్థాయిలో కూటమి అధికారం చేపట్టాక పరిస్థితులు ఎలా వుంటాయో ఎవరూ అంచనా కట్టలేక పోతున్నారు.