తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.. రాష్ట్ర ప్రజలకు వరాల వర్షమే కురిపించారు. జగన్ సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేస్తూ.. అందజేసే మొత్తం భారీగా పెంచి ఇస్తానని కూడా ప్రమాణం చేశారు. ఆయన వరాలను ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయోగించిన అస్త్రం ఒకే ఒక్కటి- ‘చంద్రబాబును జనం నమ్మరు’ అనేది! కానీ ఆయన అంచనా తప్పయింది. చంద్రబాబును ప్రజలు నమ్మారు. ఆయనకు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. తెలుగురాష్ట్రాల చరిత్రలో ఆయనను తిరుగులేని హీరోను చేశారు. ఇప్పటికే 14 ఏళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రికార్డు కలిగిఉన్న చంద్రబాబు, నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపడుతూ మరో రికార్డు సృష్టిస్తున్నారు.
ఈ అఖండ విజయం కేవలం మురిసిపోవడానికి కాదని, అయిదేళ్ల పాటు మోయవలసిన బాధ్యతల భారాన్ని గుర్తుచేస్తున్నదనే స్పృహ ఆయనకు ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. ఆర్థిక వనరుల లోటును అధిగమించడానికి సంపద సృష్టించడం తనకు తెలుసునన్న చంద్రబాబునాయుడు.. తన కార్యకుశలతను నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఆయన మీద రాష్ట్రప్రజలు పెట్టుకున్న ఆశల గురించిన కథనమే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘బాబుపైనే నమ్మకం’!
డేల్ కార్నెగీ ‘హౌ టూ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్’ అనే పుస్తకం రాశాడు. స్టీఫన్ కోవె ప్రపంచంలో అనేక మంది మహానుభావుల్ని చాలా దగ్గరినుంచి పరిశీలించిన తర్వాత.. ‘సెవెన్ హేబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ అనే పుస్తకం రాశాడు. ప్రపంచం అంతా ప్రసిద్ధులైన ఈ వ్యక్తిత్వ వికాస రచయితలు, బహుశా చంద్రబాబునాయుడును చూసి ఉంటే.. ‘ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా?’ అనే పుస్తకం రాసి ఉంటారేమో అనిపిస్తోంది.. ఇప్పుడు వెల్లడైన ఫలితాల్ని గమనిస్తోంటే. ఈ పుస్తకానికి ‘ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు లేకపోయినా సరే’ అనే ట్యాగ్‌లైన్ ఉండాలా? వద్దా? అనేది మరొక చర్చ. అదంతా పక్కన పెడితే.. నిజమే, చంద్రబాబునాయుడు ప్రజల నమ్మకాన్ని సంపాదించారు. ఆయనను ప్రజలు నమ్మే అవకాశమే లేదని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ చెప్పినప్పటికీ.. ప్రజలు నమ్మారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎటు నడవబోతున్నదో అంచనా వేస్తూ.. గ్రేట్ ఆంధ్ర ఏప్రిల్ 14వ తేదీ సంచికలో ఒక కవర్ స్టోరీ కథనం అందించింది. ‘‘నమ్మకం- ఆశ; విశ్వాసం- భరోసా; గెలుపు ఎటువైపు?’’ అనేది ఆ స్టోరీ శీర్షిక! ఫలితాలు వెలువడిన తరువాత.. జనస్పందన ఎలా ఉంటుందో అర్థమైంది. ‘ఆశ’తోనే ప్రపంచం ముందుకు నడుస్తుంది. దాని ఫలితంగానే చంద్రబాబు నాయుడు చేసిన ప్రమాణాలకు ‘నమ్మకం’ లభించింది. ఆయనకు అఖండమైన మెజారిటీ దొరికింది. 2024 లో చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టో, ప్రణాళిక ప్రజలకు ఇచ్చే వరాలు వీటన్నింటినీ వేలంపాటలాగా మార్చేశారు.
జగన్ మూడువేల రూపాయల పెన్షను ఇస్తోంటే.. బాబు పాట పెంచి నాలుగువేలు చేశారు. వికలాంగులకు నాలుగునుంచి ఆరువేలు అన్నారు. పైగా ఏప్రిల్ నుంచే లెక్కవేసి అరియర్స్ సహా ఇస్తానని ఊరించారు. వాలంటీర్లకు జగన్ 5వేల జీతం ఇస్తోంటే.. పాటపెంచి పదివేలు చేశారు చంద్రబాబు! ప్రజల మీద వరాలు కురిపించడంలో ప్రలోభపెట్టడంలో ఈసారి కొత్తపుంతలు తొక్కారు. ఏడాది కిందటే ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవన్నీ కూడా ఎటూ ఊరిస్తూనే ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆశ పెడుతుండగా.. ప్రజలు ఆ డబ్బు వద్దని ఎందుకు అనుకుంటారు?
ఆయన హామీలకు జగన్ వద్ద ఉన్న కౌంటర్ ఒకే ఒక్కటి! ‘చంద్రబాబును ప్రజలు నమ్మరు’ అనే మాట మాత్రమే. దానికి రుజువు అన్నట్టుగా పాపం జగన్ ప్రతి సభలోనూ 2014 నాటి బాబు మేనిఫెస్టో కాపీని ప్రజలకు చూపించి.. వాటిని చదివి వినిపించి.. ఇవన్నీ అమలు చేయలేదు కదా.. అని చెబుతూ, బాబు మోసగాడు అని నిరూపించడానికి ప్రయత్నించారు. జగన్ చెప్పిన మాటలు నిజమే కావొచ్చు. ఆయన 2014 నాటి హామీలను అమలు చేయకపోవడం మాత్రమే కాదు, అసలు ఆ మేనిఫెస్టో కాపీని.. తమ పార్టీ వెబ్ సైట్ నుంచి కూడా డిలిట్ చేసేసిన ఘనుడే కావొచ్చు. కానీ ఈ ఎన్నికలకోసం ప్రజల మీద ఆయన విసిరిన ఆశలవల చిన్నదేం కాదు. అందుకే పైన చెప్పిన ఏప్రిల్ నాటి ‘ఆశ-విశ్వాసం’ మధ్య పోటీ అని పేర్కొన్న కథనంలో ‘‘ఆశ జయిస్తుందా? లేదా? అనేది ఇక్కడ కీలకం. ఆశ నెగ్గిందంటే.. పరిస్థితి ఏమిటి? ముందే అనుకున్నట్టు- జగన్ వద్ద ఉన్న ప్లాన్ బీ ఏమిటి?’’ అని గ్రేట్ ఆంధ్ర ప్రస్తావించడం జరిగింది.
అంతిమంగా ఫలితాలు వచ్చే సమయానికి ప్రజల్లోని ఆశ మాత్రమే జయించినట్లు తేలిపోయింది. ఆ ఆశ చంద్రబాబు పట్ల నమ్మకాన్ని కలిగించింది. ‘ఇదివరకు మోసం చేశాడు నిజమే. ఓడిపోయిన తర్వాత మార్పు వచ్చి ఈసారి మాట నిలబెట్టుకుంటాడేమో’ అని సామాన్యుడు అనుకునే అవకాశం ఏర్పడింది. చంద్రబాబు ప్రజల మీద వరాల వర్షం కురిపిస్తే, ప్రజలు రిటర్న్ గిఫ్ట్ గా 54 శాతం వరకు ఓట్లు గుమ్మరించి సీఎం పీఠం ఎక్కించారు. ప్లాన్-బి గురించి ఆలోచించకపోవడం జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసింది.
ఇప్పుడు చంద్రబాబు ఎదుట కీలకమైన బాధ్యతలు ఉన్నాయి.
సంపద సృష్టి
సంక్షేమ పథకాల విషయంలో ఆయన పెంచేసిన వేలం పాటధరలకు అవసరమైన బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లకు వెళుతుందో జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. అయితే ఆ మాటలకు విరుగుడు అన్నట్టుగా తనకు సంపద సృష్టించడం తెలుసు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఆ సంపద సృష్టి ఏమిటో ఆయన ఇప్పుడు నిరూపించాలి. సంపద సృష్టి అనే అర్థంకాని పదబంధం యొక్క ఆచరణ రూపం ఏమిటో ప్రజలు ఇప్పుడు చూడాలి. సామాన్యులైన మనకు అర్థమైనంత వరకు సంపద సృష్టి అంటే.. ఈ సంక్షేమపథకాలకు అయ్యే వ్యయాన్ని అప్పుల మీద ఆధారపడకుండా చంద్రబాబు చేయగలగాలి. ఉన్నపళంగా అనలేం గానీ.. ఒక ఏడాది వ్యవధి తీసుకుని అయినా.. సంక్షేమ పథకాలకు సరిపడా సంపద సృష్టి జరిగేలా కొత్త విధానాలు ఆయన తీసుకురావాలి. ప్రజలు ఇప్పుడు తన మీద పెట్టుకున్న నమ్మకం తప్పు కాదని అప్పుడు నిరూపించినట్టు అవుతుంది.
పారిశ్రామికీకరణ, యువతకు ఉద్యోగాల కల్పన కూడా సంపద సృష్టి కిందికే వస్తుంది. జగన్ ఒక్క కొత్త పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారంటూ.. పచ్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసి మొత్తానికి జనాల్ని అలాగే నమ్మించారు. కానీ.. ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా.. చంద్రబాబునాయుడు ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకురాగలరో.. ఎన్ని ఉద్యోగాలకు స్థానికులకు అవకాశం ఇవ్వగలరో కూడా తేలాలి.
అలాగే సంపద విషయంలోనే ఆయన మరో మాట కూడా అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారందరినీ ప్రభుత్వ-ప్రెవేటు భాగస్వామ్యంతో సంపన్నులుగా మార్చేస్తానని చంద్రబాబు అన్నారు. ఆ మాటలు మరీ మాయగా కనిపించాయి. ఎన్నికల ప్రచారంలోనే తమ ప్రణాళిక మొత్తం ఎవ్వరూ చెప్పరు గనుక.. అదంతా కూడా నిజమే అనుకుందాం. కానీ ఆ పని ఆయన ఇప్పుడు చేసి చూపించాలి. రాష్ట్రంలో పేద, దారిద్రరేఖకు దిగువన ఉన్న వర్గాల నుంచి నిజమైన సంపన్నులు ఈ అయిదేళ్ల కాలంలో ఎలా తయారవుతారో చంద్రబాబు చూపించాలి. పేదల సంపద పెంచడం అనేది, కేవలం వారికి అందే సంక్షేమ పథకాలను కోత పెట్టడానికి చేసే మాయ కాకుండా.. ‘మాకు అసలు ఆ పథకాల అవసరమే లేదు’ అని వారు ధీమాగా భావించే స్థాయికి సంపన్నులుగా ఆయన మార్చగలగాలి. సంపద- సంక్షేమం విషయంలో ఇది ఆయన ముందున్న కీలక బాధ్యత.
అభివృద్ధి పనులు
జగన్ మీద వేసిన ప్రధానమైన నిందల్లో ఇది కూడా ఒకటి. సంక్షేమం పేరుతో ప్రజలకు నిధులు పంచి పెట్టారు తప్ప.. అభివృద్ధి పనులు చేపట్టలేదు అనేది ఆరోపణ. మరి అభివృద్ధి అంటే ఏమిటో బాబు ఇప్పుడు నిరూపించాలి. అమరావతి రాజధాని నిర్మాణాలను వీలైనంత వరకు పూర్తి చేయడం, పోలవరం ప్రాజెక్టును మళ్లీ పెండింగులో లేకుండా పూర్తిచేయడం, రాష్ట్రంలో రోడ్లన్నీ బాగుచేయించడం వంటివి బహుశా ఆయన ఎదుట ఉన్న నిర్వచనానికి సరిపడే అభివృద్ధి పనులు కావొచ్చు.
అమరావతి విషయంలో చంద్రబాబు కొత్త డ్రామాలు, మళ్లీ కొత్త ప్లాన్ల పేరిట కాలయాపన, సాగతీత లేకుండా పనులు ప్రారంభించాలి. చంద్రబాబు గెలుపులో అమరావతి అనేది చాలా కీలకం. ఎందుకంటే.. ఆయన ఆ ఎజెండాను చాలా స్పష్టంగా ప్రకటించారు. జగన్ ఏదైతే మూడురాజధానులు- మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనే మాటలు చెప్పారో దానిని ప్రజలు నమ్మలేదు.
విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తే.. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ చెప్పిన మాటల్ని ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదు. యావత్ ఉత్తరాంధ్రలో కేవలం అరకు, పాడేరు తప్ప పార్టీ ఎక్కడా గెలవలేదు. సో, మూడు రాజధానులను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని తేలిపోతోంది. అలాగే అమరావతి రైతులు చంద్రబాబు వెన్నంటి ఉన్నారు. ఆ పనులు ఇప్పుడు ఆయన పూర్తి చేయాలి. నగర నిర్మాణం మొత్తం అయిదేళ్లలో పూర్తయ్యే పని కాదు. కానీ.. వీలైనంత మేరకు నగరానికి రూపు కల్పించడం ఆయన బాధ్యత.
అలాగే.. పోలవరం విషయం కూడా చాలా ముఖ్యం. చంద్రబాబు నిజంగానే ఆచరణ శీలి అయితే.. ఒకరిమీద ఒకరు నెపం వేయకుండా రాష్ట్రానికి జీవనాడి అయిన ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేయడం అనేది తక్షణ కర్తవ్యంగా ఆయన భావించాలి.
ప్రత్యేకహోదా..
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది ఒక తీరని స్వప్నంగా, కాంగ్రెస్, బిజెపి పార్టీల కేంద్ర ప్రభుత్వాలు చేసిన వంచనకు నిదర్శనంగా మిగిలిపోయింది. 2014 తర్వాత చంద్రబాబు అధికారంలో ఉండగా, ప్రత్యేకహోదా అనే డిమాండ్ ను అడుక్కంటా తొక్కేశారు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో డబ్బుకోసం హోదా డిమాండ్ ను చంపేశారు. తీరా ఎటూ కాకుండాపోయింది. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ యావత్తును ప్రత్యేకహోదా కోసం ఉద్యమింపజేస్తూ.. తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారు. తనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకు వస్తానని 2019 ఎన్నికల్లో అన్నారు. ప్రజలు 22 సీట్లు ఇచ్చారు గానీ.. కేంద్రంలో అత్యంత బలమైన శక్తిగా ఎన్డీయే సర్కారు అప్పుడు ఏర్పడింది. వారిని బతిమాలడం తప్ప ఏదీ డిమాండ్ చేసే పరిస్థితి.. గత అయిదేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా లేదు.
హోదా రాకపోవడం అనేది, అపరిపక్వ మేధావులు జగన్ వైఫల్యంగా ప్రొజెక్టు చేయాలని చూసినప్పుడు జగన్ ఒకటే మాట చెప్పారు. ‘‘కేంద్రంలో మనమీద ఆధారపడే బిజెపి ప్రభుత్వం వచ్చి ఉంటే ఖచ్చితంగా హోదా సాధించేవాళ్లమే. కానీ, అక్కడ ఇంకా బలమైన ప్రభుత్వం వచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో అయినా సరే.. బిజెపికి బలం తగ్గాలని దేవుడిని కోరుకుందాం. మన బలంపై ఆధారపడాలని కోరుకుందాం’’ అని ఆయన అన్నారు. తీరా 2024 ఎన్నికలు పూర్తయ్యేసరికి.. జగన్ పార్టీకి కేవలం 4 సీట్లు దక్కాయి. అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ యొక్క బలం మీద ఆధారపడే కేంద్రప్రభుత్వం ఏర్పడుతోంది. ఇప్పుడు తెదేపా ఎలాంటి డిమాండ్లు చేసినా సరే.. ప్రధాని మోడీ.. వెంటనే నో చెప్పడానికి అవకాశం కూడా లేదు.
ఇలాంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాలకోసం ఉపయోగించుకోకపోతే.. చంద్రబాబునాయుడు చాలా పెద్ద తప్పు చేసినట్టే లెక్క. ప్రత్యేకహోదా తీసుకురాలేకపోతే.. అది ఖచ్చితంగా చంద్రబాబునాయుడు వైఫల్యం అవుతుంది.
చంద్రబాబునాయుడును ప్రజలు నమ్మారు. అది నిజం. కానీ చంద్రబాబు.. అటు సంపద సృష్టి- సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నిర్మాణాత్మక పనులు, ప్రత్యేకహోదా సాధన వంటి పనులు చేయడం ద్వారా ప్రజలు ఇప్పుడు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. అలా కాకుండా, నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే.. చాలా దారుణంగా ఉంటుంది. చంద్రబాబునాయుడు ప్రజలను కోరినట్టుగా ఇది ఆయనకు చివరి చాన్స్ కావొచ్చు. కానీ.. భవిష్యత్తులో ఎప్పటికీ కూడా ప్రజలు తెలుగుదేశాన్ని క్షమించరు.
.. ఎల్. విజయలక్ష్మి