మూడు దశాబ్దాల క్రితం తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్రంలోని యునైటెడ్ ఫ్రంట్ మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. ఇపుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు తాజాగా మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
కేంద్ర మంత్రి వర్గంలో క్యాబినెట్ అర్హత పొందిన వారిలో రామ్మోహన్ చాలా చిన్న వయసు కలిగిన వారు. ఆయన శ్రీకాకుళం లోక్ సభ నుంచి ఈసారి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టి విజేతగా నిలిచారు. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రిగానే అంటూ సాగింది. అనుకున్నట్లుగానే బీజేపీ అక్కడ ఎక్కువ సీట్లలో గెలిచింది. ఎన్డీయే భాగస్వామ్యంతో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు. తెలుగుదేశం నుంచి రామ్మోహన్ ని చాన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. అదే నిజం అయింది.
రామ్మోహన్ కేంద్ర మంత్రిగా తన ప్రతిభను చూపాల్సిన సమయం వచ్చింది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి 2014 నుంచి 2018 దాకా పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు. ఆయన తరువాత ఆరేళ్ళకు మరోసారి కేంద్ర మంత్రి పదవి వెనకబడిన ప్రాంతానికి వరించి వచ్చింది. రామ్మోహన్ ముందు చాలా సమస్యలు ఉన్నాయి.
విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేయించి పూర్తి చేయించడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చూడడం, వెనకబడిన ఉత్తరాంధ్ర కు ప్రత్యేక నిధులను మంజూరు చేయించడం కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు తీసుకుని వచ్చి పూర్తి చేయించడం వంటివి ఉన్నాయి.
ఆయనకు ఈ అవకాశం దక్కడంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లేకుండా పోతుంది అన్న చర్చకు తెర లేస్తోంది. బాబాయ్ అచ్చెన్నాయుడు పిల్లను ఇచ్చిన మామ బండారు సత్యనారాయణమూర్తి మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. అలాగే రామ్మోహన్ సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలూ ఏపీ మంత్రివర్గంలో చేరాలని చూస్తున్నారు. బాబు వీరిలో ఎవరిని ఎలా ఎంపిక చేస్తారు అన్నది మరో రెండు రోజులలో తేలుతుంది.