భాజపా మారిందా? మారలేదా?

మోడీ మాయాజాలం మామూలుగా వుండదు. మారినట్లే కనిపిస్తుంది.. అనిపిస్తుంది..కానీ మారదు. అవసరం కోసం, ముందుగా అంచనాలు అందుకుని, తేదేపాకు దగ్గరైంది భాజపా. తమకు కూడా అదే అవసరం కనుక తేదేపా కూడా అటే వెళ్లింది.…

మోడీ మాయాజాలం మామూలుగా వుండదు. మారినట్లే కనిపిస్తుంది.. అనిపిస్తుంది..కానీ మారదు. అవసరం కోసం, ముందుగా అంచనాలు అందుకుని, తేదేపాకు దగ్గరైంది భాజపా. తమకు కూడా అదే అవసరం కనుక తేదేపా కూడా అటే వెళ్లింది. సరే, అందరూ కలిసి మంచి విజయం సాధించారు. కేంద్రంలో పదవులు అందుకోవడమే తరువాయి. ఆంధ్ర నుంచి కూటమి ఎంపీలు మంచి విజయం సాధించారు. తేదేపా నుంచి 16 మంది ఎన్నికయ్యారు.

అయితే ముందుగానే తాము ఏమీ డిమాండ్ చేయలేదు, ఏం పదవులు, ఎన్ని పదవులు అన్నది వాళ్ల ఇష్టం అని చెప్పి, జాగ్రత్త పడ్డారు. నిజానికి అయిదేళ్ల పాటు జగన్ ను నానా యాగీ చేసారు. ప్రత్యేక హోదా ను తాకట్టు పెట్టారని. కానీ ఇప్పుడు తేదేపా కూడా హోదా ఊసే లేకుండా కేంద్రంతో భాగస్వామ్యం అందుకుంది.

ఇప్పుడు మంత్రి వర్గం ఏర్పాటైతే, 16 మంది ఎంపీలున్న తెలుగుదేశానికి దక్కినవి రెండే రెండు పదవులు. ఆంధ్ర అంతా కలిపితే మరొకటి..మొత్తం మూడు. అదే తెలంగాణకు అంత మంది ఎంపీలు లేరు కానీ రెండు పదవులు దక్కాయి. ఒకే కమ్యూనిటీకి రెండు పదవులు ఇవ్వడం సాధ్యం కాదు కనుక, చంద్రబాబు కోరి పెమ్మసాని పేరు ముందుకు తేవడంతో పురంధ్రీశ్వరి పేరు జాబితాలో లేకుండా అయిపోయింది.

70కి పైగా మంత్రుల్లో జస్ట్ 15 శాతం మాత్రమే మిత్ర పక్షాలు. మిగిలిన వారంతా భాజపా జనాలే. అయిదు మంది సభ్యులు వుంటే ఒక మంత్రి పదవి అనే లెక్క ఏదో వుందని టాక్. అందుకే అంత మంది లేరు కనుక, జనసేనకు పదవి దక్కలేదు పాపం. నిజానికి ఆంధ్రలో ఎన్ డి ఎ కు ఈ వైభోగం రావడానికి కారణం జనసేన, దాని లీడర్ పవన్. కానీ వాళ్లు పక్కకు వుండిపోయారు. భవిష్యత్ లో పవన్ ను కేంద్రానికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇస్తారని అందుకే ఇప్పుడు ఇవ్వడం లేదని టాక్.

మొత్తానికి ఏమైతేనేం ఓ కేబినెట్, ఓ సహాయ మంత్రి పదవులు ఆంధ్రకు దక్కాయి. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్ లో ఎలా వుంటుందో చూడాలి. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందా? రైల్వే జోన్ త్వరగా వస్తుందా? నిధులు గలగల పారుతాయా? అవన్నీ జరిగితే మోడీ, భాజపా మారినట్లు. లేదా జస్ట్ కనికట్టు అనే మ్యాజిక్ జరుగుతోన్నట్లు అనుకోవాలి.