రాజు గారి అమ్మాయి మంత్రిగా?

ఉమ్మడి విజయనగరం జిల్లాను టీడీపీ కూటమి స్వీప్ చేసింది. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి ఆ బాధ్యతను టీడీపీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి  జిల్లాలో ఉద్ధండులు అయిన వారు నెగ్గారు.…

ఉమ్మడి విజయనగరం జిల్లాను టీడీపీ కూటమి స్వీప్ చేసింది. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి ఆ బాధ్యతను టీడీపీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి  జిల్లాలో ఉద్ధండులు అయిన వారు నెగ్గారు. వారిలో చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

అయితే టీడీపీ అధినాయకత్వం బీసీ ఓసీ ఫార్ములాతో పాటు సీనియర్ జూనియర్ విధానం అనుసరించి పదవుల పంపకం పూర్తి చేయనుంది అని అంటున్నారు. అలా చూస్తే కనుక విజయనగరం నుంచి రెండు సార్లు పోటీ చేసినా తాజా ఎన్నికల్లో గెలిచిన పూసపాటి రాజుల వారసురాలు అయిన అదితి జగపతి రాజుకు మంత్రి పదవి దక్కనుంది అని ప్రచారం సాగుతోంది.

టీడీపీ ఫౌండర్లలో ఒకరు అయిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. సెల్ఫ్ రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో ఆయన వారసత్వం మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నారు. దాంతో ఆయన కుమార్తెకు మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా రాజుల కోట  పటిష్టమని చెప్పాలని చూస్తున్నారు.

అశోక్ గజపతిరాజు కూడా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యారు. అలా ఆయన కుమార్తెకు కూడా తొలిసారి ఎమ్మెల్యేగానే మంత్రి పదవి లభిస్తుందని పూసపాటి రాజావారి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు అయ్యే వారి జాబితాలో అదితి పేరు ఉందని అంటున్నారు. దాంతో రాజు గారి అమ్మాయి మంత్రి కాబోతోంది అన్న ప్రచారం ఊపందుకుంటోంది.