ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్‌, జ‌నాన్ని ఎమ్మెల్యేలు.. చివ‌రికి గోవిందా!

వైసీపీ ఘోర ప‌రాజ‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ ఓడిపోతుందేమో అనే అనుమానం వైసీపీ నేత‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ, మ‌రీ ఇంత దారుణంగా ప‌రాభ‌వం సంభ‌విస్తుంద‌ని అనుకోలేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ అంటున్న మాట‌. వైసీపీ…

వైసీపీ ఘోర ప‌రాజ‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైసీపీ ఓడిపోతుందేమో అనే అనుమానం వైసీపీ నేత‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ, మ‌రీ ఇంత దారుణంగా ప‌రాభ‌వం సంభ‌విస్తుంద‌ని అనుకోలేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ అంటున్న మాట‌. వైసీపీ మాజీ ప్ర‌తినిధులు, నాయ‌కులు ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై నోరు విప్పుతున్నారు. వివిధ ప‌నుల నిమిత్తం తామిచ్చిన అర్జీల‌ను సీఎంవో ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ని తాజా మాజీలు వాపోతున్నారు.

ఇదే సంద‌ర్భంలో నేత‌ల ఆరోప‌ణ‌ల‌కు వైసీపీ శ్రేణులు మ‌రికొంత స‌మాచారాన్ని క‌లిపి చెబుతున్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌న్న మాట నిజ‌మ‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో జ‌నాన్ని, పార్టీ కేడ‌ర్‌ను ఎమ్మెల్యేలు గాలికి వదిలేసి, త‌మ సంపాద‌న‌లో మునిగి తేలార‌న్న‌ది కూడా అంతే నిజ‌మ‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయింద‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

కొద్ది మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మిన‌హాయిస్తే, మిగిలిన వారంతా అధికారం వ‌చ్చిన త‌ర్వాత కేడ‌ర్‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని వాపోతున్నారు. అలాగే తాజా మాజీలు చెబుతున్న‌ట్టు అర్జీలు తీసుకుని సీఎంవోకు వెళితే, జ‌గ‌న్ న‌మ్మ‌కంగా నియ‌మించుకున్న ఉన్న‌తాధికారులు వాటిని బుట్ట‌దాఖ‌లు చేశార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఏది ఏమైతేనేం వైసీపీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌కు అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా న్యాయం జ‌ర‌గలేద‌ని, అందుకే వారి ఆగ్ర‌హాన్ని కూడా రుచి చూడాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు.

సీఎంగా జ‌గ‌న్ అధికారంలో ఉండ‌గా త‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో బాగా గ్యాప్ పెరిగింద‌న్న మాట నిజ‌మే అంటున్నారు. అలాగే జ‌నానికి జ‌గ‌న్ పూర్తిగా దూరం కావ‌డంతో క్షేత్ర‌స్థాయిలో అస‌లేం జ‌రుగుతున్న‌దో తెలుసుకునే అవ‌కాశం లేక‌పోయింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏది ఏమైతేనేం చివ‌రికి వైసీపీ నావ న‌డిస‌ముద్రంలో మునిగిపోయింద‌ని అంటున్నారు.

సీఎంవోకు వెళ్ల‌డం అంటే, అవ‌మాన‌ప‌డ‌డ‌మే అని మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి కామెంట్స్‌ను వైసీపీ సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. త‌ప్పుల్ని సరిదిద్దుకోవాల‌నే ఆలోచ‌న జ‌గ‌న్‌కు వుంటే, అంద‌రి అభిప్రాయాల్ని తీసుకుని, భ‌విష్య‌త్‌లో ఎలా అనుస‌రించాలో నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.