నాలుగు పార్టీలు మారిన ఘ‌నుడు…వైసీపీకి గుడ్‌బై!

మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు… వ‌స్త్రాలు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తుంటారు. అధికారం లేనిదే ఆయ‌న ఒక్క రోజు కూడా నిద్ర‌పోయేలా లేరు. అందుకే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు పార్టీలు మారి, ఐదో…

మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు… వ‌స్త్రాలు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తుంటారు. అధికారం లేనిదే ఆయ‌న ఒక్క రోజు కూడా నిద్ర‌పోయేలా లేరు. అందుకే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు పార్టీలు మారి, ఐదో పార్టీ అయిన వైసీపీని కూడా వీడ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని పొంద‌డంతో ఈ జంపింగ్ మాజీ మంత్రి పార్టీకి రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇదే సంద‌ర్భంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై ఆయ‌న పొగడ్త‌లు కురిపించారు. దీన్ని బ‌ట్టి ఆయ‌న మ‌లివిడ‌త రాజ‌కీయ ప్ర‌స్థానం… అధికార పార్టీ అని అర్థం చేసుకోవ‌చ్చు. 2014లో రావెల కిషోర్‌బాబు గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున గెలుపొందారు. చంద్ర‌బాబునాయుడి కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు. అయితే రావెల‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న్ను మ‌ధ్య‌లోనే త‌ప్పించారు.

దీంతో రావెల కిషోర్‌బాబు మ‌న‌స్తాపం చెందారు. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంలో టీడీపీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరి, పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండుచోట్లా ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా భ‌విష్య‌త్ లేద‌ని భావించిన రావెల‌… బీజేపీ వైపు చూశారు. కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీలో చేరిపోయారు.

బీజేపీలో కొంత కాలం కొన‌సాగారు. ఆ త‌ర్వాత బీజేపీని వీడారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌లో చేరారు. కొన్నాళ్ల‌కు ఆ పార్టీని వీడారు. ఎన్నిక‌ల ముంగిట ఆయ‌న వైసీపీలో చేరారు. ఆ పార్టీ త‌ర‌పున ప‌ని చేశారు. అయితే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి మూట‌క‌ట్టుకోవ‌డంతో రావెల మ‌న‌సు అధికార పార్టీ వైపు లాగింది. దీంతో వైసీపీకి ఆయ‌న గుడ్ బై చెప్పారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేర‌డానికి రావెల సిద్ధ‌మ‌య్యారు.