హఠాత్తుగా పోలీసుల్లో చేవ చచ్చిపోయిందా?

రాష్ట్రాన్ని ఏలడంలో రాజకీయ అధికారం ప్రధాన పార్టీల మధ్య చేతులు మారుతూ ఉండడం అతిశయం ఏమీ కాదు. కానీ అధికారం మారినప్పుడెల్లా పోలీసుల పరిస్థితి చూస్తే చాలా జాలి కలుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఏపీలో…

రాష్ట్రాన్ని ఏలడంలో రాజకీయ అధికారం ప్రధాన పార్టీల మధ్య చేతులు మారుతూ ఉండడం అతిశయం ఏమీ కాదు. కానీ అధికారం మారినప్పుడెల్లా పోలీసుల పరిస్థితి చూస్తే చాలా జాలి కలుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఏపీలో అధికారంలోకి వచ్చింది. తమాషా ఏంటంటే.. ఇంకా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనేలేదు. ఈలోగా, హఠాత్తుగా పోలీసు యంత్రాంగంలో చేవ చచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, గూండాలో చెలరేగిపోతూ ఉంటూ.. పోలీసులు దగ్గరుండి వారిమీదకు మరెవ్వరూ రాకుండా చూడడమే లక్ష్యం అన్నట్టుగా చోద్యం చూస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి రక్షణ కల్పించడానికే తాము ఉద్యోగాలు చేస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అధికార మార్పిడి జరిగిన క్షణం నుంచి, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు మారాయి. తెలుగుదేశం వారు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల మీద జగన్ బొమ్మ ఉన్న బోర్డులను ధ్వంసం చేస్తున్నారు. జగన్ మీద కక్షను ప్రభుత్వ ఆస్తుల మీద చూపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహాలను కూలగొడుతున్నారు. అయితే ఇవేమీ చాటుమాటుగా జరగడం లేదు. రాత్రికి రాత్రి కూలగొట్టి పారిపోయిన సందర్భాలు గతంలో కూడా జరిగాయి.

ఇప్పుడు అలాకాదు.. ఏదో హక్కు ఉన్నట్టుగా వచ్చి దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు స్వయంగా ఆ దాడులు చేస్తున్న వారికి భద్రత కల్పించడానికి వచ్చినట్టుగా వారి పక్కనే నిల్చుని చోద్యం చూస్తున్నారు.

గుడివాడలో కొడాలి నాని ఓడిపోవడం గురించి తెలుగుదేశం వారంతా పండగ చేసుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అపరిమితమైన నోటిదూకుడుతో అందరినీ శత్రువులుగా మార్చుకున్న వ్యక్తి కొడాలి నాని. తెలుగుదేశం వీరాభిమానులు తమ పార్టీ గెలవకపోయినా పర్లేదు గానీ, కొడాలి నాని మాత్రం ఓడిపోవాలని కోరుకున్న వారున్నారు. ఆయన ఇంటిమీదికి తెలుగుదేశం వారు దూసుకెళ్లి అందరూ వరుసగా నిల్చుని కోడిగుడ్లు ఇంటిమీదకు విసురుతూ ఉంటే.. పోలీసులు తగుమాత్రం సంఖ్యలో పక్కనే నిల్చుని చోద్యం చూస్తూ గడుపుతున్న వీడియోలు విస్మయపరుస్తున్నాయి. ఇంకా ప్రభుత్వమే ఏర్పడలేదు.. ఇది తప్పు అని చెప్పడానికి కూడా పోలీసులకు ధైర్యం లేకుండా పోతోందా? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో కూడా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. కానీ దాడులు జరిగిపోయాక వారికి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారనే విమర్శలే ఎక్కువ. కానీ తెలుగుదేశం గద్దె ఎక్కక ముందే.. తెలుగుదేశం వారికి భద్రత కల్పించి మరీ దాడులు చేయించే తరహాలో పోలీసులు మారిపోయినట్టు, వారిలో చేవచచ్చిపోయినట్టు కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.