ఎన్నికల్లో వైసీపీ పార్టీ కోసం జోరుగా ప్రచారం చేశారు యాంకర్ శ్యామల. వైనాట్ 175 అనే స్లోగన్ ను అందరి కంటే ఎక్కువగా మోశారు. అయితే ఊహించని ఫలితం వచ్చింది. దీంతో టీడీపీ జనాలు కొంతమంది శ్యామలను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మరికొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు.
“ట్రోల్స్ గురించి చెప్పేదేముంది. వైఎస్ఆర్ పై ఇష్టంతో, జగన్ అన్నతో పాటు ఉన్నాను. ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ నా దగ్గర కూడా పెట్టుకోవడం లేదు. నా భర్తే కాల్ ఎత్తుతున్నాడు. ఆయన గొంతు విని కొంతమంది కట్ చేస్తున్నారు, మరికొంతమంది బెదిరిస్తున్నారు. కొన్నాళ్లు ఇది కచ్చితంగా ఉంటుందని నాకు అర్థమైంది.”
ట్రోల్స్ తనకు కొత్తకాదంటున్న శ్యామల, కొంతమంది తనను, తన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులు మాత్రం తనను భయపెడుతున్నాయని అన్నారు.
“జగన్ పై ఉన్న ఇష్టంతోనే ఆయన పార్టీకి ప్రచారం చేశాను. జగన్ మళ్లీ సీఎం అవ్వాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున ప్రచారం చేశానంతే. నేను వ్యక్తిగతంగా ఎవ్వర్నీ దూషించలేదు. ఎవ్వర్నీ పేరు పెట్టి కామెంట్ చేయలేదు. అసభ్యంగా మాట్లాడలేదు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై ఎలాంటి ద్వేషం లేదు.”
కార్యకర్తలంతా సంయమనం పాటించాలని, కక్షపూరితంగా వ్యవహరించొద్దని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయాన్ని శ్యామల గుర్తుచేస్తోంది. అంతా పవన్ మాట వినాలని కోరుతోంది. గెలిచినా, ఓడినా, ఎప్పటికీ జగన్ అన్నతోనే ఉంటానని.. ప్రజలకు ఏం నచ్చలేదో అర్థం కావడం లేదని, చేసిన మంచి అంతా ఏమైందో తెలియడం లేదని అంటోంది శ్యామల.